
అనంతపురం జిల్లాలో వంతెనపై నుంచి పడిన ప్రైవేట్ బస్సు.. 23 మందికి గాయాలు
అనంతపురం జిల్లా పామిడి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సీవీ)ను ఢీకొని వంతెనపై నుంచి కిందపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 34 మందిలో 23 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో 11 మంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదం తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే.. ఢీకొట్టిన ధాటికి రెండు వాహనాలు ఒక్కసారిగా వంతెన పైనుంచి కిందకు పడిపోయాయి.
పామిడి పోలీస్‌స్టేషన్ పరిధిలో గూటీకి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వన్‌వే హైవేపై ఇరువైపులా వెళ్లే వాహనాల కోసం వేర్వేరు వంతెనలు ఉన్నాయి. రహదారి విశాలంగా ఉన్నప్పటికీ వంతెన వద్దకు చేరుకునే సమయంలో దాదాపు రెండు అడుగుల మేర ఇరుకుగా మారుతోంది.
ఈ విషయాన్ని ఎల్‌సీవీ డ్రైవర్ గమనించకపోవడంతో ఎడమవైపున ఉన్న రక్షణ గోడను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక నుంచి వస్తున్న బస్సు దాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు వంతెనపై నుంచి కిందపడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు శిథిలాల నుంచి గాయపడిన వారిని బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోటార్ వెహికల్ శాఖ అధికారులు కూడా ప్రమాదానికి గురైన వాహనాలను పరిశీలించారు.
