
అనంతపురం జిల్లాలో మధ్యాహ్న భోజనం తిని 30 మంది విద్యార్థులకు స్వస్థత
అనంతపురం జిల్లా ఉడేగోళం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పాఠశాలలోని మొత్తం 116 మంది విద్యార్థులు ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం చేయగా తిన్న కొద్దిసేపటికే కొంతమంది విద్యార్థుల్లో మార్పులు కనిపించాయి. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో విద్యార్థులు విలవిలలాడటంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు కలుషిత ఆహారం వల్ల 'ఫుడ్ పాయిజనింగ్' అయింది అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం బాధితులందరికీ మెరుగైన వైద్యం అందుతోందని అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించడంతో తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. పోషకాహారం అందించాల్సిన మధ్యానభోజన పథకం ఇలా విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకురావడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఆహార నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
