Let's talk: editor@tmv.in
అనంతపురంలో యువకుడి వీరంగం:సీఐ సహా ముగ్గురిపై కత్తితో దాడి

అనంతపురంలో యువకుడి వీరంగం:సీఐ సహా ముగ్గురిపై కత్తితో దాడి

Panthagani Anusha
24 డిసెంబర్, 2025

అనంతపురం జిల్లాలో మద్యం మత్తులో ఓ యువకుడు సృష్టించిన బీభత్సం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి అరవింద్‌నగర్‌లోని చర్చి సమీపంలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో డి. అజయ్‌కుమార్ అనే యువకుడు తన స్నేహితుడు చాకలి రాజాతో ఘర్షణకు దిగాడు. ఈ గొడవ ముదరడంతో అజయ్ కత్తితో దాడి చేయగా రాజా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే నిందితుడు అజయ్ దారిలో ఒక ఆటో డ్రైవర్‌పై కూడా కత్తితో దాడి చేసి కడుపులో పొడిచాడు. వరుస దాడులతో భయాందోళనలు సృష్టించిన అజయ్, ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం టీవీ టవర్ సమీపంలోని శికారీ కాలనీలో అజయ్ ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ ఎం.శ్రీకాంత్ తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అజయ్ అకుతోట్టపల్లి శివార్లలోని ఒక చెరకు తోటలోకి పారిపోయాడు. అతడిని పట్టుకునే క్రమంలో అజయ్ ఒక్కసారిగా సీఐ శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేయగా సీఐకి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆత్మరక్షణ కోసం సీఐ అజయ్ కాళ్లపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ పి. జగదీష్ తీవ్రంగా స్పందించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడటం సహించరాని నేరమని, నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాయపడిన సీఐ, ఆటో డ్రైవర్ నిందితుడు సహా ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.