Let's talk: editor@tmv.in
అధ్య‌క్ష పీఠం కోసం బంధువుల పోరు

అధ్య‌క్ష పీఠం కోసం బంధువుల పోరు

FL - BRTH
7 అక్టోబర్, 2025

టీడీపీ జిల్లా అధ్య‌క్ష పీఠం కోసం పోటీ బంధువుల(వరుసకు అన్నదమ్ములు) మ‌ధ్య‌ పోరుకు దారితీస్తోందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లా టీడీపీలో అధ్య‌క్ష పీఠం కోసం బంధువులు తెర‌వెనుక రాజ‌కీయం న‌డుపుతున్నారు. త‌మ్ముడు అడ్డురాకుండా అన్న.. ఎత్తుల‌కు పైఎత్తులు వేస్తున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ అన్న‌ద‌మ్ములెవ‌రు ?. టీడీపీ అధ్యక్ష పీఠం కోసం ఎందుకంత వెంప‌ర్లాట ?.

ప్ర‌కాశం జిల్లా టీడీపీలో ఒంగోలు ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ పెద్ద‌దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో కూడా పార్టీలో పెద్ద‌న్న పాత్ర పోషించారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చారు. అధికారంలో కూడా త‌న పాత్ర చేజార‌కుండా వ్యూహం ప‌న్నుతున్నారు. ప్ర‌కాశం జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా ఇన్నాళ్లు నూక‌సాని బాలాజీ కొన‌సాగారు. కానీ ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి రావ‌డంతో ఆ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఆ స్థానం త‌న‌కు కేటాయించాల‌ని దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ సోద‌రుడు దామ‌చ‌ర్ల స‌త్య అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఎందుకంటే దామ‌చ‌ర్ల స‌త్య‌కు టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెడితే త‌న ఆధిప‌త్యానికి చెక్ ప‌డుతుంద‌నే భావ‌న దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ లో ఉంది. అందుకే టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎస్సీల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని జ‌నార్ధ‌న్ ప్ర‌తిపాదిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నూక‌సాని బాలాజీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆ స్థానంలో ఎస్సీకి అవ‌కాశం ఇవ్వాల‌న్న‌ది జ‌నార్ద‌న్ ప్ర‌తిపాద‌న‌. రెడ్డి,క‌మ్మ‌ల‌కు ఇస్తే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని అధిష్టానాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. కానీ దామ‌చ‌ర్ల స‌త్య మాత్రం త‌న‌కు ఇవ్వాల‌ని పట్టుబ‌డుతున్నారు. అయితే క‌మ్మ సామాజికవర్గానికి చెందిన దామ‌చ‌ర్ల స‌త్య‌కు ఇస్తుందా ?. ఎస్సీల‌కు ఇస్తుందా ? అన్న నిర్ణ‌యం అధిష్టానానికే వ‌దిలేశారు తెలుగుత‌మ్ముళ్లు. కానీ దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ ప్ర‌తిపాద‌నే అధిష్టానం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ సంత‌నూత‌లపాడు ఎమ్మెల్యే బీఎన్. విజ‌య్ కుమార్ పేరును ప్ర‌తిపాదిస్తున్నారు. సంత‌నూత‌లపాడు ఒంగోలుకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అధ్య‌క్షుడు అంద‌రికీ అందుబాటులో ఉంటాడు అని దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ చెబుతున్నట్టు స‌మాచారం.

దామ‌చ‌ర్ల స‌త్య‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌ధానం కార‌ణం.. త‌న పెత్త‌నం త‌గ్గుతుంద‌నే భ‌యం దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్ లో ఉండ‌టం. ఇప్పటి వ‌ర‌కు ఉన్న త‌న పెత్త‌నం సోద‌రుడు అధ్య‌క్షుడైతే త‌గ్గుతుంద‌ని, పార్టీ అధిష్టానంతో కూడా స‌త్య‌కు సాన్నిహిత్యం పెరుగుతుంద‌ని భావిస్తున్నారు. అంతిమంగా అది త‌న‌ను న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని జ‌నార్ధ‌న్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే ఆదిలోనే అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే వ్యూహాత్మ‌కంగా ఎస్సీ పేరును ప్ర‌తిపాదిస్తున్నారు. కానీ అధిష్టానం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ మాత్రం ప్ర‌కాశం తెలుగు త‌మ్ముళ్ల‌లో ఉంది.

అధ్య‌క్ష పీఠం కోసం బంధువుల పోరు - Tholi Paluku