Let's talk: editor@tmv.in
అధిష్టానం ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది: సీఎం సిద్దరామయ్య

అధిష్టానం ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది: సీఎం సిద్దరామయ్య

Pinjari Chand
11 డిసెంబర్, 2025

కర్ణాటక సీఎం మార్పు వివాదం ఇప్పటిలో తేలేలాగా లేదు. ఎండింగ్ లేని సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య కలిసి ఇటీవల ఒకరింటికి ఒకరు వెళ్లి అల్పాహారం చేసినా, సీఎం మార్పు అంశం ఇంకా సద్దుమణగలేదని తెలుస్తోంది. సీఎం కావడానికి డీకే , పదవి కాపాడుకోవడానికి సిద్ధరామయ్య ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తాజా సంఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. తాజాగా తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న వివాదంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని సీఎం అన్నారు. అలాగే వారు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. బుధవారం బెళగావికి వచ్చిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ కందులు (తుర్ దాల్) విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని, గ్యారంటీ పథకాలపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. తుర్ దాల్ విషయంలో కేంద్రానికి లేఖ రాశాను. సీఎల్‌పీ సమావేశంలో ఏమైనా జరిగితే ఇక్కడ చెప్పడం సాధ్యమా? అన్నీ మీ అందరికీ చెప్పగలమా? అని సిద్దరామయ్య అన్నారు.

సమావేశాలు నిర్వహిస్తున్న ఇరువురు నేతలు

ఇక కర్ణాటకలో నాయకత్వ వివాదం కొనసాగుతూనే ఉంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిరంతరం శాసనసభ్యులతో, మంత్రులు హెచ్‌సీ మహదేవప్ప, సతీష్ జార్కీహోళి వంటి వారితో సమావేశాలు జరుపుతూ మద్దతు కూడగడుతున్నారు.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ రెండు సార్లు అల్పాహారం కలిసి తిని పార్టీ ఐక్యతను చాటుకున్నా, హైకమాండ్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సిద్దరామయ్య మౌనం వెనుక బీకే హరిప్రసాద్, సతీష్ జార్కీహోళి, ఎంబీ పాటిల్, భైరతి సురేష్, దినేష్ గుండు రావు, హెచ్‌సీ మహదేవప్ప, జమీర్ అహ్మద్ వంటి సీనియర్ నాయకుల మద్దతు ఉందని భావిస్తున్నారు. అయినా డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో నిరంతర సమావేశాలు జరుపుతూ ‘నాయకత్వం - సీఎం మార్పు’ అనే గందరగోళాన్ని కొనసాగిస్తున్నారు.

త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిద్దరామయ్య, శివకుమార్ ఇద్దరూ పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్పారు. నవంబర్ 20న సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు (2.5 సంవత్సరాలు) పూర్తి కావడంతో నాయకత్వ మార్పు పుకార్లు మొదలయ్యాయి. ప్రజలు ఇచ్చిన మాట, ఐదు గ్యారంటీ పథకాల అమలు కారణంగా తాను పూర్తిగా ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్దరామయ్య చెబుతున్నారు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత తనను సీఎంగా చేసే రహస్య ఒప్పందం ఉందని చెబుతూ డీకే శివకుమార్ నాయకత్వ మార్పు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.