Let's talk: editor@tmv.in
అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం: ఏపి సీఎం

అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం: ఏపి సీఎం

Dantu Vijaya Lakshmi Prasanna
12 డిసెంబర్, 2025

రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిని ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, రుణాలు, వడ్డీలను రీ-షెడ్యూల్ చేయడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు.

వడ్డీ భారంపై సీఎం సమీక్ష

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సగటున 12 శాతం మేర అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చారని సీఎం తెలిపారు. రుణాల రీ-షెడ్యూలింగ్ ద్వారా మొదటి ఏడాదిలోనే రూ. 512 కోట్ల మేర ఆదా చేయగలిగామని, ఈ మార్చి నాటికి ఇది రూ. 1,000 కోట్లకు చేరుతుందని చెప్పారు. కొన్ని కార్పోరేషన్లు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను పరిశీలించి, బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపితే ఈ ఆదా సాధ్యమైందని వివరించారు. మొత్తంగా అప్పులపై ఏడాదికి రూ. 7 వేల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేశారు. గత పాలనలో ఏపీ బ్రాండ్ పోవటం వల్లే అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు వాటన్నిటినీ రీషెడ్యూలు చేసి ప్రజాధనాన్ని కాపాడుతున్నామని తెలిపారు.

పాలనలో మార్పు అత్యవసరం

ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం రావాలన్నా, సంతృప్తి చెందాలన్నా ప్రభుత్వ శాఖలు అత్యుత్తమంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడేది లేదన్నారు. టెక్నాలజీ ఆడిటింగ్‌తో పాటు ఆఫీసర్ల వ్యవహారశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవడమే కాక, ఫలానా అధికారి, ఫలానా విభాగం బాగా పని చేస్తుందని ప్రజలే చెప్పే స్థాయిలో అధికారులు పనిచేయాలని సూచించారు. అంతా కలిసి పని చేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజారోగ్యం, టెక్నాలజీ వినియోగం

ప్రజారోగ్యం విషయంలో అధికారులు అలెర్ట్‌గా ఉండాలని, నీటి సరఫరా లోపాల వల్ల వ్యాధులు వచ్చే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఆయా శాఖల అధికారులనే బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు.

అధికారుల్లో పోటీతత్వం పెంచేందుకు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి డేటా లేక్ వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం 800కు పైగా సేవలు వాట్సప్ ద్వారా అందిస్తున్నామని, మిగతా సేవలను కూడా ఈ పరిధిలోకి తీసుకువస్తే మొత్తం 1200 సేవలు వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. న్యాయ విభాగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పెండెన్సీ కేసుల విషయంలో ప్రణాళికలు చేయాలని, ఇ-ఫైల్స్ డిస్పోజల్ వేగంగా జరిగేలా చూడాలని సూచించారు.

కేంద్ర నిధుల వినియోగంపై దృష్టి

డిసెంబర్ నెలాఖరులోగా ఖర్చు పెట్టాల్సిన సుమారు రూ. 1,171 కోట్ల కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను ఇప్పటికీ ఖర్చు చేయకుండా వివిధ శాఖలు జాప్యం చేస్తున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిధులను డిసెంబరు 20 లోగా ఖర్చు చేసి, యూటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. కేంద్రం ఇచ్చిన నిధులు మురిగిపోకుండా తక్షణం సద్వినియోగం చేసుకోవాల్సిందేనని, ఈ విషయంలో మంత్రులు తమ కార్యదర్శుల్ని గైడ్ చేయాలని సూచించారు. రోజుల తరబడి ఫైళ్లు మంత్రుల వద్ద పెండింగ్‌లో ఉండకూడదని, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

పనితీరు పెరగాలి... ఫిర్యాదులు తగ్గాలి

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తామని సీఎం తెలిపారు. రైతులు, పంటల ధరలు, రహదారులు, ఉద్యోగాల కల్పన, తాగునీరు, ధరల పెరుగుదల లాంటి అంశాల్లో మెరుగ్గా స్పందించాలని ఆదేశించారు.

రెవెన్యూ, పోలీసు, పురపాలక శాఖల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్సులు వస్తున్నాయని, ప్రజా ఫిర్యాదులు వెంటనే పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు తగ్గితేనే ఆయా శాఖల పనితీరు మెరుగైనట్టుగా భావిస్తామన్నారు. సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ సవరించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రియల్ టైమ్‌లోనే పరిష్కారాలు అందించేలా చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో సుపరిపాలన ప్రజలకు చేరేలా అంతా కలిసి పనిచేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలల్లో చేపట్టిన 'ముస్తాబు' వంటి మంచి కార్యక్రమాలను రాష్ట్రమంతటా అమలు చేయాలని సూచించారు.

అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం: ఏపి సీఎం - Tholi Paluku