
అధిక లోడ్ బస్సులపై కఠిన చర్యలు తప్పవు...మంత్రి మండిపల్లి రాంప్రసాద్
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ సమరశంఖం పూరించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అధిక లోడ్‌తో నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఉక్కుపాదం మోపాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 976 ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీ చేయగా, అందులో సరైన పత్రాలు లేని, నిబంధనలు ఉల్లంఘించిన 193 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ బస్సుల యాజమాన్యాలకు భారీగా జరిమానాలు విధించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికులతో పాటు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులను (కమర్షియల్ లోడ్) రవాణా చేయడంపై ఆయ న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
16 కీలక ప్రాంతాల్లో నిఘా
ప్రమాదాల కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన టోల్‌ప్లాజాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మొత్తం 16 పాయింట్లలో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కేంద్రాల వద్ద అధికారులు నిరంతరం పహారా కాస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పు వచ్చే వరకు ఈ 'స్పెషల్ డ్రైవ్ లు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యం
ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదు. నిబంధనలను అతిక్రమించి అతివేగంగా నడిపినా పరిమితికి మించి సరుకులు రవాణా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. వాహనదారులు, ప్రైవేట్ ఆపరేటర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రవాణా శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తే లైసెన్సుల రద్దుతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.
