Let's talk: editor@tmv.in
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే.. సహించేది లేదు: డిప్యూటీ సీఎం భట్టి

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే.. సహించేది లేదు: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
25 డిసెంబర్, 2025

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి అభివృద్ధి పథకం అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో విద్యా, సంక్షేమ రంగాలపై విశేష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం నిజమైన అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజల పన్నుల ద్వారా మాత్రమే ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుందని గుర్తు చేసి, ప్రతి బాధ్యతపై జవాబుదారీగా పని చేయాలని హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఇకపై నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యా రంగంలో విశేష పెట్టుబడులు పెట్టి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తున్నట్టు ఆయ‌న‌ తెలిపారు. అలాగే, సంక్షేమ పథకాల పెండింగ్ బిల్లులను వేగంగా విడుదల చేయడం, ఆలస్యాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఉన్నదని ఆయ‌న తెలిపారు.

గిరిజన రైతులకు ఇందిరా సౌర గిరి జలవికాసం

గిరిజన రైతుల అభివృద్ధికి ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్, పంపుసెట్లు, డ్రిప్, ప్లాంటేషన్ సౌకర్యాలను అందిస్తున్నట్లు ఆయ‌న‌ వివరించారు. ప్రభుత్వ భవనాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయ‌న‌ తెలిపారు.

గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

సమీక్షా కార్యక్రమానికి అనుబంధంగా డిప్యూటీ సీఎం వైరా నియోజకవర్గం, కొనిజర్ల మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినీలతో భోజనం చేసి, వసతి, బోధన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం అవసరమైన వనరులను సమీక్షించి, దోమల నివారణ కోసం విద్యార్థినీలు తయారు చేసిన అగరవత్తులను బ్రాండింగ్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యం, సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి అంశాలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం ప్రతీ నిర్ణయం ప్రజల సంక్షేమానికి దోహదపడే విధంగా తీసుకుంటోందని డిప్యూటీ సీఎం తెలిపారు.