Let's talk: editor@tmv.in
అధికారం అడ్డుపెట్టుకుని భూ దోపిడీకి పాల్పడుతున్నారు: వైకాపా

అధికారం అడ్డుపెట్టుకుని భూ దోపిడీకి పాల్పడుతున్నారు: వైకాపా

Panthagani Anusha
1 ఫిబ్రవరి, 2026

విశాఖపట్నం కేంద్రంగా భారీ భూ కుంభకోణం జరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అధికార బలాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఆస్తులను కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైకాపా) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి తన సొంత కుటుంబ ప్రయోజనాల కోసం ధారాదత్తం చేశారని ఆరోపించింది. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి తన సమీప బంధువు, విశాఖ ఎంపీ భరత్‌కు కేటాయించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని వైకాపా నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేటాయింపులుగా గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకున్న ఈ భూములను, కూటమి ప్రభుత్వం రాగానే 'కానుక'గా ఇచ్చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ భూ కేటాయింపుల వెనుక మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారనేది వైకాపా ప్రధాన ఆరోపణ. విద్యాశాఖతో ఈ భూములకు ఎలాంటి సంబంధం లేకపోయినా తన అధికార పరిధిని దాటి లోకేష్ ఒక ప్రత్యేక మెమో జారీ చేయించారని వారు పేర్కొన్నారు. తన తోడల్లుడికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని లోకేష్ ప్రభావితం చేశారని ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని గత ప్రభుత్వ హయాంలో అక్రమాలని గుర్తించి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఇప్పుడు 'బహుమానం'గా ఇచ్చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ప్రజాస్వామ్య విలువల ఊచకోత జరిగిందని వైకాపా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ భూ కేటాయింపుల తీర్మానాన్ని ఆమోదించుకోవడానికి కార్పొరేటర్లను బెదిరింపులకు గురిచేశారని ప్రతిఘటించిన వారిపై భౌతిక దాడులు చేయించారని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా మేయర్‌ను అప్రజాస్వామికంగా తొలగించి, తన దారికి అడ్డులేకుండా చేసుకున్నారని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైకాపా కార్పొరేటర్లను బయటకు నెట్టివేసి పోలీసుల అండతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయమని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ భూములు మాయమవ్వడం ఆయన కుటుంబ ఆస్తులు గణనీయంగా పెరగడం ఒక ఆనవాయితీగా మారిందని వైకాపా విమర్శించింది. విశాఖను అభివృద్ధి చేయడం పక్కన పెట్టి, తన కుటుంబ సభ్యుల ఆర్థిక ప్రయోజనాల కోసమే విశాఖపై చంద్రబాబు కన్నేశారని రాష్ట్ర ప్రజల ఆస్తి అయిన రూ. 5 వేల కోట్ల భూములపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అక్రమ కేటాయింపులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ప్రజల తరపున పోరాటం చేస్తామని వైకాపా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.