Let's talk: editor@tmv.in
అధ్యయనం పేరుతో విహార యాత్రాలా?

అధ్యయనం పేరుతో విహార యాత్రాలా?

FL - YUGDR
18 సెప్టెంబర్, 2025

వైసీపీ పోయి కూటమిపాలన వచ్చినా విశాఖలో మార్పేమీ లేదు. వైసీపీ పాలన కాలంలో కార్పొరేటర్ల అధ్యయన యాత్రను తీవ్రంగా విమర్శించిన కూటమి నేతలు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఖర్చుతో అధ్యయనం పేరిట విహారయాత్రకు బయలుదేరారు. బుధవారం విశాఖకు చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా పట్టించుకోకుండా తెలుగుదేశం కార్పొరేటర్లు అంతా మంగళవారమే యాత్ర కోసం విమానాలు ఎక్కేశారు.

దీని పేరుతోగ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ) లో కూటమి నేతల వసూళ్ల పర్వానికి అంతులేకుండా పోతోంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ పేరుతో వసూళ్లకు తెగబడిన కూటమి నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్ల అధ్యయన యాత్ర పేరుతో టార్గెట్లు విధించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. జీవీఎంసీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత విభాగాల వారీగా లక్ష్యాలు విధించి మరీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి

వసూళ్ల పర్వం

వాస్తవానికి కూటమి నేతలు జీవీఎంసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త ప్రాజెక్టును కూడా ప్రారంభించ లేదు. పైగా చికెన్ వ్యర్ధాల పేరుతో జోన్ను ఒకరిద్దరు నేతలు పంచుకుని మరీ చేపలు, ఎరువుల చెరువుల యజమానులకు విక్రయించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ జీవీఎంసీ పరువును కాస్తా రోడ్డున పడేశారు. ఇక స్టాండింగ్ కమిటీ పేరుతో పనులను ఆమోదించేందుకు 10 శాతం మేర కమీషన్ వసూలు చేశారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. వచ్చిన కమిషన్ ను 12 వాటాలకు విభజించి పంచుకున్నారని ఆరోపణలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా అనధికార కట్టడాలకు అంతస్తుకు ఇంత మొత్తం ఇవ్వాల్సిందేనంటూ లక్షలకు లక్షలు బిల్డర్లవద్ద నుంచి తీసుకుంటున్నారు. ఇక పోస్టింగుల కోసం కూడా జీవీఎంసీలోని కీలక నేత భారీగా దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టూర్ పేరట భారీ వసూళ్లు

ఇవి చాలదన్నట్టుగా ఇప్పుడు టూర్ పేరుతో కూడా టార్గెట్లు విధించడంపై జీవీఎంసీలోని అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కూడా మండిపడుతున్నారు. ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ తో పాటు రెవెన్యూ అధికారులకు భారీగా టార్గెట్లు విధించారని తెలుస్తోంది. అధికారికంగా ఈ టూర్ కోసం జీవీఎంసీ ఖజానా నుంచి ఒక కోటి 53 లక్షల రూపాయల మేర ఇప్పటికే నిధులను విడుదల చేయగా... అనధికారికంగా మరో కోటి రూపాయల మేర వసూళ్లు చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ , మెకానికల్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, యూసీడీ ఇలా అన్ని విభాగాల అధికారులనుపిలిచి ఇంత మొత్తం వసూలు చేసి ఇవ్వాలంటూ లక్ష్యాలు విధించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జైపూర్, జోద్పూర్, జైసల్మార్, ఢిల్లీ ప్రాంతాల్లో అధ్యయన యాత్ర పేరుతో జీవీఎంసీ కార్పొరేటర్లు మంగళవారం విమానాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, సీపీఎం కార్పొ రేటర్ గంగారావుతో సహా 15 మంది దూరంగా ఉంటున్నారు.

కార్పొరేటర్లకు పాకెట్ మనీ కూడా

అయితే, కార్పొరేటర్లు టూర్ వెళుతున్నందున.. కూటమి కార్పొరేటర్లకు కొంత మొత్తం ఖర్చుల కోసం ఇవ్వాలంటూ ఈ వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. ఒక్కో కార్పొరేటర్ కు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పాకెట్ మనీ గా అందజేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని విభాగాల నుంచి సదరు కీలక నేతకు భారీ మొత్తం ముట్టినట్టు కూడా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మొత్తంగా కోటి రూపాయల మేర ఈ విధంగా దండు కున్నట్టు తెలుస్తోంది..

వ్యతిరేకత తగ్గించుకునేందుకు...!

వాస్తవానికి సదరు జీవీఎంసీలోని కీలక నేత వ్యవహారశైలిపై రోజురోజుకీ సొంత పార్టీ నేతలతో పాటు కూటమి కార్పొరేటర్ల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. మొదట్లో అందరితో కలుపుగోలుగా ఉన్నట్టు నటించిన సదరు నేత.. ఇప్పుడు అందరితోనూ అంటిముమట్టనట్టుగా ఉంటు న్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వసూళ్ల వ్యవహారంలో ఎవరితో సంబంధం లేకుండా సొంత టీంతో వ్యవహారాలు సాగించడం పైనా లోలోపల రగిలిపో తున్నారు.

ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ ఆయన వ్యవహారశైలి పట్ల మండిపడిన ముగ్గురికే ఈ వసూళ్ల బాధ్యతలు అప్పగించి నట్టు సమాచారం. తద్వారా వ్యతిరేకత తగ్గిం చుకునేందుకు ఈ టూర్ ను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. అక్షరాలా కోటి రూపా యలను దండు కోవాలని లక్ష్యంగా పెట్టుకుని మరీ ముక్కుపిండి మరీ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల్లోని అధికారులను గుర్తించి.. వారికే వసూళ్ల బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.

సీఎం కంటే టూరే ముద్దు!

2023 వ సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి తరలి వెళ్ళిన సమయంలోనే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విశాఖ నుంచి టూర్ కి బయలుదేరారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన సమయంలో ఆ పార్టీ కార్పొరేటర్లు విహారయాత్రకి వెళ్లడం ఏమిటంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడువివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విశాఖ వచ్చారు .

అయితే, సీఎం నగరానికి వస్తున్న సమయంలో ప్రోటోకాల్ మేరకు నగర ప్రథమ పౌరుడు మేయర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయినప్పటికీ సీఎం పర్యటనకు ముందు రోజే మేయర్ పీలా శ్రీనివాసరావు తో పాటు ఆ పార్టీ కార్పొరేటర్లు విమానంలో పర్యటనకు వెళ్లిపోవడం పైసొంతపార్టీలోనే విమర్శలువ్యక్తమవుతున్నాయి. నగర ప్రథమ పౌరుడిగా సీఎంకు స్వాగతం పలకకుండా టూర్కు వెళ్లడం ఏమిటంటూ వాపోతున్నారు. ఇప్పటికే మేయర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సొంత పార్టీకి చెందిన నేతలు ఇదే విషయంపై నేరుగా సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.

అధ్యయనం పేరుతో విహార యాత్రాలా? - Tholi Paluku