Let's talk: editor@tmv.in
అధికారం కోసం పదవి చేపట్టలేదు

అధికారం కోసం పదవి చేపట్టలేదు

Venkatesh Balusula
15 సెప్టెంబర్, 2025

తాను అధికారం కోసం పదవి చేపట్టలేదని, దేశాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత తనతో పాటు తన బృందంపై ఉందని నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల్లో కొత్త పార్లమెంటుకు బాధ్యతలు అప్పగిస్తామని సుశీల ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

మృతులకు అమరులుగా గుర్తింపు

నేపాల్లో సెప్టెంబర్ 8న ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియా నిషేదానికి వ్యతిరేకంగా జరిగిన జెన్ జడ్ ఆందోళనలు కేపీ శర్మ ఒలీ ప్రభుత్వాన్ని కూల్చాయి. దేశ వ్యాప్తంగా అల్లర్లు తీవ్ర స్థాయికి చేరడంతో నేపాల్ ఆర్మీ బాధ్యతలు చేపట్టింది. కర్ఫూ విధించి శాంతిభద్రతలపై దృష్టి పెట్టారు. ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ ఆందోళనల్లో సుమారు 72 మంది మరణించారు. వీరిలో 59 మంది ఆందోళనకారులు, 10 మంది ఖైదీలు, ముగ్గురు పోలీసులున్నారు. వీరిని అమరులుగా గుర్తిస్తామని సుశీల ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం, గాయపడిన వారి చికిత్స ఖర్చులు, ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కేవలం 27 గంటల్లో ఇంత పెద్ద మార్పును ఎన్నడూ చూడలేదని, ప్రతి ఒక్కరూ మార్పు కోసం నిశ్చయంతో పని చేయాలని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టం, హింసను సుశీల ఖండించారు. ఈ ఘటనలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు కనిపిస్తోందన్నారు. దీని వెనుక ఏమైనా కుట్రలు ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి నష్టపోయిన వారికి రుణాలు లేదా ఇతర సహాయం ద్వారా పరిహారం అందిస్తామన్నారు. ఈ ఘటనల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేపాల్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, తాత్కాలిక ప్రభుత్వం పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.

అధికారం కోసం పదవి చేపట్టలేదు - Tholi Paluku