
అది నిరూపిస్తే తల నరుక్కుంటా: భూమన
తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణిలో చోరీ జరిగిందని నిరూపిస్తే తల నరుక్కుంటానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జ్ఞాన శూన్యమూర్కేషు నారా లోకేష్, భక్తిలేని రసరాయుడు బీ.ఆర్.నాయుడు అని ఎద్దేవా చేశారు. తాను చైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణిలో చోరీ జరిగిందని చెప్పారని అది నిజమైతే, అలిపిరి వద్ద తన తలను నరుక్కుంటానని చెప్పారు. ఆది అబద్ధమైతే ఆరోపణలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
శ్రీవెంకటేశ్వర స్వామివారిని కూటమి నేతలు ఆట వస్తువుగా మార్చారని ఆరోపించారు. 2023 సంవత్సరంలో జీయర్ మఠానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి నుంచి 72 వేలు విలువ చేసే, 8 విదేశీ డాలర్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రవికుమార్ అనే వ్యక్తిని విచారించగా 20 సంవత్సరాలుగా అతడు చోరీ చేస్తున్నాడని బయట పెట్టింది తమ ప్రభుత్వ హయాంలోని అధికారులే అని వివరించారు. అతడిని పట్టుకుంది వైకాపా ప్రభుత్వంలోని అధికారులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తన భర్త చేసిన అపచారానికి, నేరానికి, తప్పుకు అతని భార్య దేవస్థానం అధికారులని కలిసి ప్రాయశ్చిత్తంగా 100 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి స్వాధీనం చేశారని వెల్లడించారు. 2024 సంవత్సరంలో 14 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి వారు ఇవ్వడం జరిగిందని చెప్పారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న గత 15 సంవత్సరాల హయాంలో అతడు ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటాడని ప్రశ్నించారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిందిందని, దమ్ము, ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను శ్రీవారి భక్తుడిగా అడుగుతున్నానని, సీబీఐ ద్వారా విచారణ చేయించండని కోరారు. ఆ రవికుమార్ అనే వ్యక్తి బినామిలకు ఇచ్చాడని చెబుతున్నారు. సీబీఐ ద్వారా విచారణ ద్వారా బహిర్గతం చేయాలన్నారు. టీటీడీ చరిత్రలో తప్పు చేసిన వ్యక్తి, తన ఆస్తులు రాయించిన సంఘటన ఉందా.. అది, వైకాపా ప్రభుత్వంలో జరిగిందని గుర్తు చేశారు. శ్రీవాణి దర్శనం పేరిట అవకతవకలు జరిగాయని చెప్పారు. కానీ ఆ టిక్కెట్లని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. రద్దు చేయకపోగా, ఆ టిక్కెట్లు సంఖ్యను మరింత పెంచారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రవికుమార్ వ్యవహారం బయటపడి ఉంటే, రవికుమార్ ఆస్తులు టీటీడీకి కాకుండా టీడీపీకి చెందేవని ఎద్దేవా చేశారు. AP 40 CN 9788 నెంబరు గల కారులో చోరీ చేసిన లింగమూర్తి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌లో గొంతు కోసుకున్నా ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు స్వామివారిని వాడుకోవడం రివాజుగా మారిందని ఆరోపించారు.
