
అది రాజకీయ సమావేశం కాదు.. ఎమ్మెల్యేలతో డిన్నర్ మీట్‌పై డీకే శివకుమార్ వ్యాఖ్య
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (డీకేఎస్) ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేకంగా రాజకీయ విందు సమావేశం నిర్వహించారనే వార్తలను శుక్రవారం తీవ్రంగా ఖండించారు. తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీ నాయకులు, సహచరుల ప్రేమపూర్వక ఆహ్వానం మేరకే వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. బెలగావిలో విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్, పార్టీ కార్యకర్తలు, పాత స్నేహితులు తరచూ భోజనానికి ఆహ్వానిస్తుంటారని, వాటిని రాజకీయ ఉద్దేశంతో కాకుండా మర్యాదపూర్వకంగా అంగీకరిస్తానని తెలిపారు.
"ఈ ప్రాంతంలోని స్నేహితులు ప్రేమతో నన్ను భోజనానికి పిలుస్తారు. నేను ఎలా కాదనగలను? అది ప్రత్యేకంగా ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ కాదు. పిలిచినప్పుడు వెళ్లాలి కదా” అని అన్నారు. బెలగావి శివార్లలో ఎమ్మెల్యేలతో డిన్నర్ గురించి ప్రత్యేకంగా ప్రశ్నించగా, ఆయన పైవిధంగా స్పందించారు.
"మా నియోజకవర్గానికి చెందిన ఒక అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నాడు. అతడు మధ్యాహ్నం భోజనానికి 'ముద్దె, ఉప్సారు' (రాగి ముద్ద, రసం) పంపుతానని అన్నాడు. దాన్ని నేను కాదనగలనా? ఆ తర్వాత, ఆసిఫ్ సైట్, ఫిరోజ్ సైట్ కూడా నన్ను ఆహ్వానించారు” అని డీకే శివకుమార్ అన్నారు.
"దొడ్డన్నవర్ బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. నాకు మంచి స్నేహితుడు కూడా. చాలా కాలంగా నన్ను విందుకు ఇంటికి పిలుస్తున్నాడు. నా కాంగ్రెస్ కుటుంబాన్ని నేను ఎలా మర్చిపోగలను? అందుకే నేను, కొందరు కలిసి అక్కడ డిన్నర్‌కు వెళ్ళాం. అంతేగానీ, అది రాజకీయ సమావేశం కాదు" అని డీకేఎస్ అన్నారు.
చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి
ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇవ్వడంపై కూడా డీకే శివకుమార్ స్పందించారు. నగర ప్రతిష్ఠను కాపాడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. "బెంగళూరు నగర గౌరవాన్ని కాపాడేందుకు మేము అవసరమైన చర్యలు తీసుకున్నాం. తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలనే షరతుతో మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చాం" అని డీకేఎస్ తెలిపారు.
భద్రతా ఏర్పాట్ల బాధ్యతను హోంమంత్రి జి.పరమేశ్వరకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. "మ్యాచ్‌ల సమయంలో సరైన నివారణ చర్యలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కేఎస్‌సీఏ (కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, వారి బృందం పోలీసు విభాగంతో చర్చిస్తుంది" అని శివకుమార్ వివరించారు.
