Let's talk: editor@tmv.in
అదిగదిగో 8వ ఖండం

అదిగదిగో 8వ ఖండం

FL - TRND
17 అక్టోబర్, 2025

మన భూమికి ఉన్న ఖండాలు ఎన్ని? ఈ ప్రశ్న వినపడగానే ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం 7. అయితే ఒక్క నిమిషం ఆగండి.. భూమికి మరో ఖండం కూడా ఉంది. ఇది సాక్ష్యాత్తు సైంటిస్టులే చెబుతున్న వాస్తవం..! ఏంటీ.. అర్థంకాలేదా? చిన్నప్పుటి నుంచి ఏడు ఖండాల గురించే కదా చదువుకున్నామని ఆలోచిస్తున్నారా? స్కూల్‌ బుక్స్‌లో కూడా అదే ఉంది కదా అని థింక్‌ చేస్తున్నారా? అయితే ఈ అద్భుత నిజం మీరు తెలుసుకోవాల్సిందే..! 375ఏళ్లుగా ఓ ఖండం మనకు కనపడకుండా ఉండిపోయిందట..! అవునండి..! భూమికి ఉన్న ఈ ఎనిమిదో ఖండం గురించి తెలుసుకోండి.

దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో దాదాపు 20 లక్షల చదరపు మైళ్ల మేర ఓ కనిపించని ప్రపంచం దాగి ఉంది. ఈ భూమిపై ఎనిమిదో ఖండం ఉందని ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు. దాని పేరు.. జిలాండియా. ఈ జిలాండియా ఇప్పుడు నీటిమట్టం కింద ఉన్నప్పటికీ.. ఇది గతంలో ఇలా ఉండేదేం కాదు. దాని కథ చాలా కాలం క్రితమే మొదలైంది. ఇది తెలియాలంటే సుమారు 10కోట్ల సంవత్సరాల నాటి ఫ్లాష్‌ బ్యాక్‌కు వెళ్లాలి.

జిలాండియా అనేది గోండ్వానా అనే గొప్ప సూపర్ ఖండంలో ఒక భాగంగా ఉండేది. అదే ఖండం ఆ తర్వాత కాలంలో ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆంటార్కటికా, ఆస్ట్రేలియా ఉపఖండలుగా విడిపోయింది. ఇలా విడిపోయే ప్రక్రియలోనే జిలాండియా కూడా తన సొంత ప్రయాణం మొదలెట్టింది. జిలాండియాలో మొదటిగా దక్షిణ భాగం వేరు కావడం మొదలైంది. దాదాపు 8కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఆంటార్కటికా నుంచి విడిపోయింది. తర్వాత 6కోట్ల ఏళ్ల క్రితం.. దాని ఉత్తర భాగం ఆస్ట్రేలియా నుంచి విడిపోయింది. భూకంపాల శక్తి.. భూకండాల కదలికల వల్ల జిలాండియా శీతలమైన భూభాగంగా మారిపోయింది. ఇక సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం జిలాండియా క్రస్ట్ బాగా తేలికగా మారిపోయింది. అప్పటి నుంచి ఇది క్రమంగా సముద్రంలో మునిగిపోతూ వచ్చింది. న్యూజిలాండ్ లాంటి కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటికీ నీటి మీద కనిపిస్తున్నాయి. మిగిలిన మొత్తం ఖండం మాత్రం నీటి లోతుల్లో దాగి ఉంది. ఇప్పటివరకు కేవలం ఊహలకే పరిమితమైన ఈ ఖండం కథకి ఇప్పుడు శాస్త్రీయ ఆధారాల రూపంలో కొత్త మలుపు వచ్చి చేరింది. ఆధునిక టెక్నాలజీతో చేసిన అధ్యయనాలు, సముద్రపు లోతుల్లో సేకరించిన శిలలు, భూ గర్భ నిర్మాణాల విశ్లేషణలు... ఇవన్నీ జిలాండియా నిజంగా ఒక ఖండమే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు జిలాండియాపై రోజురోజుకు కొత్త సమాచారం బయటకొస్తోంది. శాస్త్రవేత్తలు ఆధునిక పరికరాలతో సముద్రపు లోతుల్లో అధ్యయనాలు జరుపుతున్నారు. ప్రత్యేకమైన డ్రెడ్జింగ్ టెక్నిక్‌లతో జిలాండియాకు చెందిన రాళ్లను తీసుకొస్తుననారు. కారల్-సీ వరకూ విస్తరించిన భాగాల్లో చేసిన సర్వేలలో కీలక విషయాలు వెలుగుచూశాయి. శాండ్‌స్టోన్‌, మడ్‌స్టోన్‌, లైమ్‌స్టోన్‌, బాసాల్ట్ లాంటి పలు రకాల శిలలు బయటపడ్డాయి. ఇవి కేవలం రాళ్లు మాత్రమే కాదు... జిలాండియాలో ఏ సమయానికి ఏ పరిస్థితులు ఉన్నాయో చెబుతున్న సాక్ష్యాలు. ఈ శిలల్లో కొన్నింటిని పరీక్షించి చూస్తే.. అవి సుమారు 9.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని తేలింది. మరికొన్ని గ్రానైట్, అగ్నిపర్వత శిలలు 13 కోట్ల సంవత్సరాల నాటి జిలాండియా చరిత్రను చూపిస్తున్నాయి.

అంతేకాదు.. సమీపంగా లభించిన బాసాల్ట్ శిలలు కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన భూగర్భ ఉత్పత్తుల్ని సూచిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. జిలాండియా కేవలం మునిగిపోయిన భూభాగం మాత్రమే కాదు.. అది భూగర్భ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కూడా. ఇక శాస్త్రవేత్తలు ఇప్పుడే మొదటిసారిగా జిలాండియాలోని ఉత్తర భాగాన్ని పూర్తి స్థాయిలో మ్యాప్ చేశారు. ఇది జిలాండియాను ఖండంగా గుర్తించాడానికి ఉపయోగపడనున్న ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు.

ఇంతకీ.. జిలాండియా ఎందుకు అంత ముఖ్యమో కూడా మీరు తెలుసుకోవాలి. ఇది భూగర్భ చరిత్రకు ఓ టైమ్ క్యాప్సుల్‌ లాంటిది. భూమి గతాన్ని, ప్లేట్ కదలికల ప్రభావాన్ని, సముద్రాల రూపాంతరాలను అర్థం చేసుకునే విషయంలో ఇది కీలకమైన ఆధారాల్ని ఇస్తోంది. దీని ద్వారా మనం భూమి గత చరిత్రను మాత్రమే కాదు.. భవిష్యత్తు మార్పులను కూడా అంచనా వేయడం సాధ్యమవుతుంది. ఇప్పటికీ జిలాండియా మీద పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రపు లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకెన్నో ఖండాలనే కాకుండా.. కొత్త ప్రపంచాల ఆవిష్కరణకు కూడా పరిశోధనలే ప్రారంభం కావచ్చు. సైంటిస్టుల దృష్టిలో ఇది చాలా విలువైన పరిశోధన. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే జిలాండియాను ఇకపై ఒక మిస్టరీగా చూడాల్సిన అవసరం ఇక లేదేమో..! అది భూమికి ఉన్న ఎనిమిదో ఖండమనే అంగీకారానికి అందరూ రావాల్సిన సమయం దగ్గరపడినట్టేనేమో!

అదిగదిగో 8వ ఖండం - Tholi Paluku