Let's talk: editor@tmv.in
అందరూ చూస్తుండగానే బ్యాంకు లూటీ

అందరూ చూస్తుండగానే బ్యాంకు లూటీ

T Venkata Ramana
18 సెప్టెంబర్, 2025

కర్ణాటకలోని విజయపూర జిల్లా చడ్చనా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపింది. ముసుగులు ధరించిన దుండగులు ఆయుధాలతో బ్యాంకులోకి చొరబడి, సిబ్బందిని తాళ్లతో బంధించి స్ట్రాంగ్ రూమ్లో దాచిన రూ.21 కోట్ల విలువైన బంగారం, నగదును దోచుకుని పారిపోయారు. ఈ ఘటన 'మనీ హైస్ట్' సీరియల్లా వ్యూహాత్మకంగా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన కెనరా బ్యాంకు దోపిడీ తర్వాత ఇది రెండో పెద్ద బ్యాంకు దొంగతనం. దొంగలు మహారాష్ట్ర సరిహద్దుకు పారిపోయి ఉండవచ్చని ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి తెలిపారు.

సిబ్బంది పాత్ర లేదు

ఈ దోపిడీలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమీ లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే దుండగులు బ్యాంకు మూసివేసే సమయాన్ని ఎంచుకోవడం, అలారం బెల్ను నొక్కకుండా బెదిరించడం వంటి వ్యూహాలు ముందుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ముఠాకు 'ఖాదీమారా' గ్యాంగ్తో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి దోపిడీలకు పాల్పడిన ముఠాలను ట్రాక్ చేస్తూ కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో గాలింపు ముమ్మరం చేశారు.

దోపిడీ ఎలా జరిగింది?

మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ముసుగులు ధరించిన దుండగులు కొత్త కరెంట్ అకౌంట్ తెరవాలని చెప్పుకుని బ్యాంకులోకి ప్రవేశించారు. వారు మిలిటరీ యూనిఫాం లాంటి దుస్తులు ధరించి, దేశీయ తుపాకులు, చెక్క, కత్తుల వంటి ఆయుధాలతో సిబ్బందిని బెదిరించారు. బ్యాంకు మేనేజర్తో సహా 5 మంది సిబ్బంది చేతులు, కాళ్లు తాళ్లతో బంధించి, టాయిలెట్లో లాక్ చేశారు. "సొమ్ము తీసుకురా, లేకపోతే చంపేస్తాం" అని బెదిరించి, స్ట్రాంగ్ రూమ్ కీలు తెప్పించుకున్నారు.

ఎంత పోయింది?

అధికారికంగా రూ.1 కోటి నగదు, 20 కేజీల బంగారు నగలు (రూ.20 కోట్ల విలువ) దోచుకున్నట్లు తేలింది. అయితే స్థానికంగా మాత్రం 59 కేజీల బంగారం, రూ.8 కోట్ల నగదు దొంగిలించారని ప్రచారం జరుగుతోంది. అసలు ఎంత పోయిందనేది విచారణలో వెల్లడికానుంది. బ్యాంకు సిబ్బంది కూడా పోలీసులు ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఎంతమంది ఖాతాదారుల బంగారు ఆభరణాలు ఉన్నాయనే వివరాలను తీస్తున్నారు. ఆ రోజు జరిగిన బ్యాంకు లావాదేవీలు, బ్యాంకులో ఉన్న నగదు ఎంతుందనే వివరాలను బట్టి అసలు దోపిడీ దొంగలు ఎంత మొత్తంలో ఎత్తుకు పోయారనే వివరాలు వెల్లడికానున్నాయి. దోపిడీని కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి చేసిన దుండగులు, సూజుకి ఈవా కారు లో పారిపోయారు. కారు మహారాష్ట్ర పంధర్పూర్ ప్రాంతానికి చెందినదని, దుండగులు మహారాష్ట్రలో దాగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు వాడిన కారు నెంబర్ కూడా నకిలీదని పోలీసులు అనుమానిస్తున్నారు.

దుండగులు ఎవరు?

బ్యాంకు మూసివేసే సమయాన్ని ఎంచుకోవడం, సిబ్బందిని అలారం బెల్ నొక్కకుండా బెదిరించడం, ముందుగా అకౌంట్ తెరవాలని చెప్పుకుని రెక్కీ చేయడం వంటివి వారి వ్యూహాత్మక ప్రణాళికను సూచిస్తున్నాయి. పోలీసులు అనుమానిస్తున్నట్లుగా, దుండగులు కనీసం పది రోజులు రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతంలో ఇలాంటి దోపిడీలకు పాల్పడిన ఇంటర్-స్టేట్ గ్యాంగ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. 'ఖాదీమారా' ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. సీసీటీవీ ఫుటేజ్లో దుండగుల ముఖాలు కనిపించకపోయినా, వెహికల్ ట్రాకింగ్పై దృష్టి పెట్టారు.

గాలింపు ముమ్మరం

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోయింట్లు ఏర్పాటు చేశారు. పంధర్పూర్ ప్రాంతంలో దొంగలు దాగి ఉండవచ్చని అనుమానంతో మహారాష్ట్ర పోలీసులతో సంప్రదింపులు చేస్తున్నారు.

త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్పీ నింబార్గి తెలిపారు. బ్యాంకులోని సీసీటీవీలు, డీవీఆర్, ఫింగర్ప్రింట్లు సేకరించి విశ్లేషణ చేస్తున్నారు.

గతంలో జరిగిన కెనరా బ్యాంకు దోపిడీ మాదిరిగానే

ఈ ఏడాది మే లో విజయపూర జిల్లా మనగూలి గ్రామంలోని కెనరా బ్యాంకు శాఖలో ఇలాంటి భారీ దోపిడీ జరిగింది. 58.97 కేజీల బంగారం (రూ.53.26 కోట్లు), రూ.5.2 లక్షల నగదును దోచుకున్నారు. దొంగలు బ్యాంకు మూసివేసిన తర్వాత చొరబడి సీసీటీవీ కేబుళ్లను కట్ చేసి, డాల్స్ పెట్టి మిస్లీడ్ చేశారు. ఈ కేసులో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. 39 కేజీల బంగారం, రూ.1.1 కోట్ల నగదు రికవర్ చేశారు. ఈ ముఠాకు 'ఖాదీమారా' గ్యాంగ్ సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఎస్బీఐ దోపిడీకి ఈ ముఠాతో సంబంధాలున్నాయాననే కోణంలోనూ విచారిస్తున్నారు.

అందరూ చూస్తుండగానే బ్యాంకు లూటీ - Tholi Paluku