
అదరగొట్టిన అర్బన్ కంపెనీ
అర్బన్ కంపెనీ స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ లిస్టింగ్ తో అదరగొట్టింది. కంపెనీ జారీ చేసిన ఐపీవో ధరపై 57 శాతం కంటే ఎక్కువ ప్రీమియమ్ తో షేర్లు లిస్ట్ అయ్యాయి. ఐపీవోలో పాల్గొనడానికి ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపడంతో 103 రెట్లు సబ్ స్క్రిప్షన్ అయింది. యాప్ వేదికగా హోమ్ సర్వీస్ అందించే అర్బన్ కంపెనీ రూ.1900 కోట్లు సమీకరించేందుకు ఐపీవో కోసం వచ్చింది. కంపెనీ రూ. 98-103 మధ్య ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను ఇష్యూ చేసింది. సెప్టంబర్ 17న ఎన్ఎస్ఈ ఎక్స్చేంజీలో ఒక్కో షేరు రూ. 162.25తో లిస్ట్ అయింది. బీఎస్ఈలో రూ.162తో లిస్ట్ అయింది. అందరూ ఊహించినదానికంటే ఎక్కువ ప్రీమియంతో మార్కెట్ లో లిస్ట్ అయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. గతంలోనే రూ.854 కోట్లు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి అర్బన్ కంపెనీ నిధులు సమీకరించింది.
అర్బన్ కంపెనీ ఐపీవో ద్వార సమీకరించిన నిధుల్ని టెక్నాలజీ అభివృద్ధికి, క్లౌడ్ ఇన్ప్రాస్ట్రక్చర్, ఆఫీస్ లీజు చెల్లింపునకు, మార్కెటింగ్ కార్యకలాపాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనుంది. ఐపీవో ద్వార షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లు వాటిని దీర్ఘకాలం కొనసాగించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వారు కొంత కాలం వేచిచూడటం మంచిదని సూచిస్తున్నారు. అర్బన్ కంపెనీ విషయంలో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తున్నప్పటికీ.. టెక్నాలజీ డ్రివెన్ కంపెనీల్లో దీర్ఘకాల మార్పులు అనివార్యమని భావిస్తున్నారు.
పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని, కొత్త కంపెనీలు అదే సెగ్మెంట్ లోకి వచ్చినప్పుడు ఆదాయ, లాభాలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అంచనా వేస్తున్నారు. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంటే తప్పా పోటీని తట్టుకుని నిలబడలేవని చెబుతున్నారు. అలాంటి సందర్భంలో ఊహించిన విధంగా దీర్ఘకాల అభివృద్ధిని కంపెనీల్లో ఆశించలేమని భావిస్తున్నారు. కాబట్టి దీర్ఘకాలంలో షేర్లు కొనసాగించాలని అనుకునే వారు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు. కంపెనీల భవిష్యత్ వృధ్ది పైన, ఆయా కంపెనీల సెక్టార్లలో ఉన్న పోటీని అంచనా వేసుకుని, స్పష్టమైన దృష్టితో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
