Let's talk: editor@tmv.in
అదానీ కేసులో దిల్లీ కోర్టు రెండు తీర్పులను ఎలా చూడాలి?

అదానీ కేసులో దిల్లీ కోర్టు రెండు తీర్పులను ఎలా చూడాలి?

Dr.Chokka Lingam
20 సెప్టెంబర్, 2025

అదానీ విషయంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. భావప్రకటనాస్వేచ్ఛకు అనుకూలంగా ఉన్నట్టు తీర్పు కనిపిస్తోంది. అయితే అంతకుముందు అదానీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తీసెయ్యాలని కోర్టు తీర్పు ఇవ్వడం, కేంద్రం యుద్ధప్రాతిపదికన స్పందించి తీసేయడం ప్రజాస్వామ్యవాదులను కలవరపరిచింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికి భావప్రకటనాస్వేఛ్చను కల్పిస్తుంది. అయితే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు. భావప్రకటనాస్వేఛ్చ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు, రాయకూడదు. భావవ్యక్తీకరణ చేయకూడదు. ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందికానీ దానికి పరిమితులున్నాయి. అయితే ఆ పరిమితులను ఉపయోగించి ప్రజలను తమకు వ్యతిరేకంగా నోరు తెరవనీకుండా ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తే, కొందరు ప్రజలు ఆ స్వేఛ్చను దుర్వినియోగం చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తారు.

అయితే మొత్తంగా భావప్రకటనా స్వేచ్ఛ అన్నది మాత్రం రాజ్యాంగం దేశపౌరులకు కల్పించిన గొప్ప అవకాశం. అలాగే ఉండితీరాల్సిన అంశం. రాజ్యాంగం ఆ అవకాశాన్ని కల్పించి ఉండకపోతే ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు తీసుకునే ప్రజావ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా ప్రజలు నోరు తెరిచే అవకాశం ఉండేది కాదు. భావప్రకటనాస్వేచ్ఛ కిందే ప్రజలు పోరాడగలుగుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వీధుల్లోకొస్తున్నారు. సాధారణ ప్రజలే కాదు...ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మీడియా వారధిగా ఉండే వీలు కల్పిస్తోంది భావప్రకటనాస్వేచ్ఛే. ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేకనిర్ణయాలను ప్రజలకు తెలియజేసి,వాళ్లను చైతన్యవంతులను చేస్తోంది. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగోస్తంభం కావడానికి కారణం భావప్రకటనాస్వేచ్ఛే.

అయితే ఈ స్వేచ్ఛ ఉంది కదా అని మీడియా అయినప్పటికీ ఇష్టానుసారం తోచింది రాయొచ్చా,అబద్ధపు ప్రచారాలు చేయొచ్చా, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వానికి, సంస్థలకు పరువునష్టం కలిగించొచ్చా అంటే లేదనే సమాధానం. కానీ ఓ విషయం తెలిసినప్పుడు, అది నిజమేనని ఎడిటోరియల్ గైడ్ లైన్స్ ప్రకారం అనిపిస్తే ఆ వార్తను ప్రసారం చేసే, ప్రచురించే హక్కుమీడియాకు ఉంటుంది. అది ఉద్దేశవపూర్వకంగా చేస్తున్నట్టు ప్రభుత్వానికో, సదరు సంస్థకో, వ్యక్తికో అనిపించినప్పటికీ అందులో ప్రజోపయోగ పరిరక్షణ ఉంటుంది.

అదానీ కేసు విషయమే చూసుకుంటే ఆయనకు వ్యతిరేకంగా కొన్నేళ్లగా పలు ఆరోపణలు వస్తున్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రధాన మీడియాతో పాటు పత్రికలు, యూట్యూబ్ చానళ్లు పలు కథనాలు ప్రచారంచేశాయి. ప్రచురించాయి. దీంతో పాటు 2014కు అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అదానీ ఆస్తులు ఎంతున్నాయో, ఆ తర్వాత ఆయన ఎంత సంపాదించారో ఏ స్థాయిలో సంపన్నుడిగా ఎదిగాడో తెలియజేస్తూ నిరంతరం పత్రికల్లో, మీడియాలో వార్తలొస్తూనే ఉన్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఈ పదేళ్లకాలంలో అదానీమీద వచ్చినన్ని ఆరోపణలు బహుశా ఎవ్వరిమీదా లేవు. ఎప్పటికప్పుడు అదానీ వాటిని ఖండిస్తున్నప్పటికీ, తాజాగా హిండెన్ బర్గ్ విషయంలో సెబీ అదానీకి, ఆయన కంపెనీలకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు మాత్రం ఆగడం లేదు.

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం అదానీకి వ్యతిరేకంగా తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. పోర్టులు, విమానాశ్రయాలను ఎన్డీఏ ప్రభుత్వం అదానీకి ధారాదత్తం చేసిందనేది తరచూ వినిపించే ఆరోపణ. అదానీ కంపెనీలతో పాటు, ఈ వ్యాపారాలైనా, విదేశాల్లో ఆయన పరిశ్రమలపైనా దేశవ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ చానళ్లలో, సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే వీటిని వ్యతిరేకిస్తూ అదానీ ఇటీవల దిల్లీ కోర్టులో సివిల్ డీఫేమషన్ కేసు వేశారు. అదానీ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఆ వీడియోలు, పోస్టులు తక్షణమే తొలగించాలని ఆదేశించింది. వెంటనే ఆ ఆదేశాలను పాటిస్తూ కేంద్రం 138యూట్యూబ్ వీడియోలు, 83ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు తీసేసింది. సెప్టెంబరువ 6న కోర్టు తీర్పు రాగా, సెప్టెంబరు13న వీడియోలన్నంటినీ తొలగించింది. తర్వాత రెండు రోజులకు కోర్టు తిరిగి మరో రకమైన ఆదేశాలిచ్చింది. కొందరు జర్నలిస్టులపై ఉన్న టేక్‌డౌన్ ఆదేశాలను రద్దుచేసింది. మరోపక్షం వాదన చెప్పే అవకాశం ఇవ్వకుండా వెంటనే వీడియోలు తొలగించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.

అదానీ కేసు నేపథ్యంగానే ఇప్పుడు డిజిటల్ ఫ్రీ స్పీచ్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం అని, భావప్రకటనాస్వేచ్ఛకు లభించిన హామీ అని అంటుంటే అదానీని సమర్థించేవారు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. తమకిష్టమొచ్చినవి రాసుకునే, ప్రచారం చేసే, ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం మీడియాకు ఇచ్చినట్టుఅవుతుందని అంటున్నారు. భావప్రకటనాస్వేచ్ఛపేరుతో ఓ వ్యక్తికి లేదా సంస్థకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోబెల్స్ స్థాయి ప్రచారం చేసి,ఆ వ్యక్తులకు, సంస్థలకే కాకుండా ప్రజలకు నష్టాన్ని, ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినప్పటికీ భావప్రకటనాస్వేచ్ఛను దెబ్బతీసేలా, అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించేలా వ్యవస్థలుండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడలో ఉన్నట్టు లెక్క. తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ప్రభుత్వమో, వ్యక్తులో, సంస్థలో అనుకుంటే కోర్టులు అందుకు ఆమోదముద్ర వేస్తే సమాజంలోని అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా నోరుమెదపడానికి ఎవరూ ఉండరు. మాట్లాడే స్వేచ్ఛనే మనిషి నుంచి తీసేస్తే ఆ అసంతృప్తి పెరిగి పెద్దదై ప్రభుత్వాలనే కూలదోస్తుంది. నేపాల్‌లో జరిగింది అదే. సోషల్ మీడియాను అక్కడి ప్రభుత్వం నిషేధిస్తే, అంతకుముందు అవినీతిపై ఉన్న వ్యతిరేకతకు ఈ అంశం తోడై అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. చివరకు ప్రభుత్వం కూలిపోవాల్సి వచ్చింది. భారత్‌లో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ భావప్రకటనాస్వేచ్ఛ విషయంలో కేంద్రం అత్యుత్సాహానికి పోకూడదు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలానో, దేశాన్ని కించపరిచేలానో వ్యాఖ్యలుంటే ఎలాగూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. వ్యక్తులు కోర్టులను ఉపయోగించుకుని భావప్రకటనాస్వేచ్ఛను అడ్డుకోవడం, కేంద్రం అందుకు సహకరించడం సరైనది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదానీ కేసులో దిల్లీ కోర్టు రెండు తీర్పులను ఎలా చూడాలి? - Tholi Paluku