Let's talk: editor@tmv.in
అదనపు బస్సులపై అదనపు బాదుడు

అదనపు బస్సులపై అదనపు బాదుడు

T Venkata Ramana
20 సెప్టెంబర్, 2025

దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ షాకిచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో అడ్డగోలుగా 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరో భారం కానుంది.

పండుగ జోరులో ప్రయాణికులు

సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలు వచ్చినప్పుడల్లా ఇలా ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయడం ఆర్టీసీకి ఒక అలవాటుగా మారిపోయింది. సాధారణ ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ సొంతూళ్లకు వెళ్లి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ఆశిస్తారు. కానీ ఆర్టీసీ ఇలా అధిక ఛార్జీలు వసూలు చేయడంతో చాలామంది ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. లేక ప్రయాణ ఖర్చుల కోసం అధిక భారాన్ని మోయాల్సి వస్తోంది. అధిక ఛార్జీలతో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తమ ధరలను పెంచుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేట్ ట్రావెల్స్‌ల మధ్య చిక్కుకుని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు.

సామాన్య ప్రయాణికుల ఆవేదన

పండగ వస్తే చాలు ఆర్టీసీ ధరలు పెంచుతోంది. నష్టాలు వస్తున్నాయని చెబుతున్నప్పటికీ, ప్రతి పండుగకు లక్షలాది మంది ప్రయాణికులు ఉంటారు. ఒకవైపు ప్రయాణికుల తాకిడిని తట్టుకోవడానికి ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ, మరోవైపు అధిక ఛార్జీల పేరుతో జేబులకు చిల్లు పెడుతోంది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు అని ఒక సామాన్య ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకే ఆర్టీసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకుండా ఆర్టీసీ నిర్ణయాన్ని సమర్థించడం సరైన పద్ధతి కాదని ఆయన వాపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రయాణికుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని పలువురు కోరుతున్నారు. లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీతో పాటు ప్రభుత్వ సంస్థల దోపిడీని కూడా ప్రజలు భరించాల్సి వస్తుంది.

నేటి నుంచి పెరగనున్న రద్దీ

విద్యాసంస్థలకు ఈ నెల 21 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 20వ తేదీ సాయంత్రం, 21న రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. మొత్తం పండుగ రోజుల్లో ఏడు వేల పైచిలుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇక సెలవులు ప్రారంభమయ్యే 20, 21వ తేదీల్లో 1,079 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబరు 2న ఉండటంతో ఈ నెల 27 నుంచి సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్, ఉప్పల్‌ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనుంది. కొన్ని బస్సులను బస్టాండ్లకు రాకుండా నేరుగా అక్కడి నుంచే పంపేందుకు ప్రణాళికలు రూపొందించారు. నగరంలోకి బస్సులు వస్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ముందస్తు చూపుతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

రెగ్యులర్‌ బస్సు ఛార్జీల్లో మార్పు లేదు

‘దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే జీవో నంబర్‌ 16 ప్రకారం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తిరుగుప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్‌ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్‌ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పుండదు అని ఆర్టీసీ తెలిపింది. ‘ప్రత్యేక బస్సులు మొదలయ్యే ప్రాంతాల్లో ప్రయాణికులకు కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పిస్తామని, ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నష్టాలు పూడ్చుకునే ప్రయత్నం

టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ అదనపు ఛార్జీల నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. దసరా వంటి పండుగలకు బస్సులు వెళ్లేటప్పుడు పూర్తిగా నిండినప్పటికీ తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని దీని వల్ల డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగి ఆర్టీసీకి నష్టాలు వస్తాయని పేర్కొంటున్నారు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకే అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని వివరణ ఇస్తున్నారు. సాధారణంగా పండుగలకు బస్సులు పూర్తిస్థాయిలో రద్దీగా నడుస్తాయి. ఈసారి కూడా సుమారు ఏడు వేల అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే ఈ బస్సుల్లో జీరో టికెట్ సదుపాయం కూడా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల మండిపాటు

ఆర్టీసీ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. పండుగలు వస్తే చాలు ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది సిగ్గుచేటని ఆరోపించారు. పండుగ వేళ అదనపు ఆదాయం కోసం సామాన్య ప్రజలను దోపిడీ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు ఇష్టారాజ్యం

ఇక ప్రైవేటు ట్రావెల్స్ వసూళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్ ధర కంటే రెండు, మూడు రెట్లు పెంచేస్తుంటారు. అత్యవసరంగా వెళ్లాలనుకునేవాళ్లు ఎంతైనా పెట్టి వెళ్లాల్సి వస్తోంది. ఏకంగా ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీయే అదనంగా 50 శాతం ఛార్జీలు బహిరంగంగా వసూలు చేస్తుంటే తామెందుకు చేయోద్దన్నట్లు ఇష్టారీతిన వసూలు చేస్తుంటారు. ఇప్పటికే 90 శాతం ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ పైనే ఆధారపడుతున్నారు. దీంతో వారు దోపిడీకి తెరలేపుతున్నారు.

అదనపు బస్సులపై అదనపు బాదుడు - Tholi Paluku