
అద్దంలో దాగున్న అహంకారం
నిజమైన వ్యక్తిని తనను తాను అద్దంలో చూసుకుంటే, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ, తనను తాను అతిశయంగా ఊహించుకునే ఒక అద్దం ఉంది. అందులో కనిపించే ప్రతిబింబం మాత్రమే నిజమని నమ్మే మనస్తత్వం ఒకటి ఉంది. అదే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది కేవలం గొప్ప అహంకారం మాత్రమే కాదు. అహంకారపు తెర వెనుక లోతైన అభద్రతా భావం, ఒంటరితనం, ఎవరూ అర్థం చేసుకోలేని బాధ ఉంటుంది. తనను తాను లోపాలు లేనివారిగా భావించే ఈ వ్యక్తులు, తమలో ఉన్న లోపాలను గమనించలేరు. వారి ఆత్మగౌరవం ఒక సన్నని గాజుతెర లాంటిది. ఏ చిన్న విమర్శ వచ్చినా పగిలిపోతుంది. ఈ పరిస్థితి వల్ల వారు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్నవారు కూడా తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటారు.
నార్సిస్టిస్టక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక భయంకరమైన మానసిక ఆరోగ్య సమస్య. ఈ వ్యాధి చాలా చిత్రమైనది. ఇటువంటి వ్యక్తులు మన మధ్యే ఉంటారు. వారికి ఆ సమస్య ఉందనే విషయం కూడా వారికి తెలియకపోవచ్చు. తమను తాము ఇతరులకంటే భిన్నమైన వారిమని.. గొప్పవారమని భావించడం.. తాము చెప్పింది అందరూ వినాలని అనుకోవడం.. నిత్యం ఇతరుల నుంచి ప్రశంసలు ఆశించడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యకు సంబంధించి తాజాగా ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యాధి లక్షణాలు, దాని వెనుక ఉన్న కారణాలు, చికిత్స ఎంత సవాలుతో కూడుకున్నదో తెలుసుకుంటే, వారిని ఎలా అర్థం చేసుకోవాలో మనకు ఒక మార్గం దొరుకుతుంది. ఈ అహంకారపు పొరల కింద, నిజమైన మనిషిని ఎలా కనుగొనవచ్చో, వారికి ఎలా సహాయం చేయవచ్చో ఈ అధ్యయనం మనకు చూపుతుంది. ఈ విశ్లేషణ, వ్యాధితో బాధపడేవారు, వారిని ప్రేమించేవారు ఇద్దరికీ ఒక కొత్త దారిని చూపిస్తుంది. వారు అద్దంలో చూసే ప్రతిబింబం కన్నా ఎక్కువ అని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యాధిని అర్థం చేసుకోవడానికే కాదు, మనిషిలోని సంక్లిష్ట భావోద్వేగాలను, మానవ సంబంధాలను మరింత అర్థం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.
తనలో తాను ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుని ఇతరుల నుంచి ప్రశంసల కోసం నిరంతరం ఎదురుచూసే మనస్తత్వం. ఇదే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ వ్యాధి కేవలం అహంకారం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన అభద్రతా భావాలు, భావోద్వేగాల సంక్లిష్టత దాగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 1 శాతం నుంచి 2 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ రుగ్మత ఉన్నవారు తమ సమస్యలను గుర్తించలేరు, కానీ వారి చుట్టూ ఉన్నవారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఒత్తిడికి లోనవుతారు, ఇతరులకు బాధను కలిగిస్తారు. వారి జీవిత నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఈ పరిశోధన ప్రకారం, ఈ వ్యాధికి గల కారణాలు, లక్షణాలు, చికిత్సా పద్ధతుల గురించి గత దశాబ్దంలో చాలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్యను కేవలం వ్యక్తిగత బలహీనతగా చూడలేం. ఇది ఒక క్లిష్టమైన మానసిక రుగ్మత. అహంకారపు అద్దంలో ఉన్న భయాన్ని, అభద్రతను ఎలా చూడాలో ఇది మనకు నేర్పుతుంది.
నార్సిసిజం… నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ - ఒక చిన్న తేడా
నార్సిసిజం అనేది ప్రతి మనిషిలో ఉండే ఒక సాధారణ లక్షణం. మనం అందరం అప్పుడప్పుడు గొప్పగా కనిపించాలని, ప్రశంసలు పొందాలని కోరుకుంటాం. ఇది ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, మీరు ఒక పనిలో విజయం సాధించినప్పుడు, ఇతరులు మిమ్మల్ని పొగిడితే మీకు ఆనందం కలుగుతుంది. ఇది సాధారణ నార్సిసిజం.
అయితే, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. ఇది కేవలం గొప్పగా కనిపించాలనే కోరిక కాదు, ఇది ఒక వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారు తమను తాము అత్యంత ఉన్నతమైనవారిగా భావిస్తారు, ఇతరుల భావాలను పట్టించుకోరు. అంతేకాకుండా, వారి అహంకారం, అభద్రతా భావం వారి జీవితంలోని అన్ని సంబంధాలను దెబ్బతీస్తుంది. వారు తమను తాము విమర్శించుకోలేరు, తప్పులను అంగీకరించలేరు.
అహంకారానికి, అభద్రతకు మధ్య వ్యత్యాసం
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారిలో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది, గ్రాండియోస్ నార్సిసిజం, ఈ లక్షణాలు ఉన్నవారు చాలా ధైర్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ వారు ఇతరులతో సులభంగా విభేదాలు పెట్టుకుంటారు, ఎప్పుడూ ఇతరులతో తమను పోల్చుకుంటారు. వీరు తమ హోదాను పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు, తమ ఆత్మగౌరవం ఎక్కువగా ఉందని నమ్ముతారు.
రెండోది, వల్నరబుల్ నార్సిసిజం, ఈ లక్షణాలు ఉన్నవారు ఇతరులతో కలవడానికి ఇష్టపడరు. వీరు ఎక్కువగా ఆందోళన, భయం, సిగ్గు, కోపం, నిరాశ వంటి భావాలను అనుభవిస్తారు. వీరిలో ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది, ఇతరులపై నమ్మకం తక్కువ, సంబంధాలలో సంతృప్తి ఉండదు. అయితే, వీరు కూడా తమకు ప్రత్యేక ప్రయోజనాలు, శ్రద్ధ ఉండాలని ఆశిస్తారు.
ఆసక్తికరంగా, ఈ రెండు రకాల లక్షణాలు ఒకే వ్యక్తిలో కలిసి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనను తాను అహంకారంగా, పోటీతత్వంతో ఉన్నవాడిగా భావిస్తూ, గొప్ప కలలు కంటాడు. కానీ అదే సమయంలో, అతను తన భాగస్వామి తనను వదిలేస్తాడేమోన ని లేదా తనలో ఏదో లోపం ఉందని తీవ్రమైన భయాన్ని, అభద్రతను అనుభవిస్తాడు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు ఇతరుల భావాలను, అవసరాలను గుర్తించడంలో ఇబ్బందులు పడతారు. దీనివల్ల వారి సంబంధాలు పైపైన, అసంబద్ధంగా ఉంటాయి.
కారణాలు అనేకం
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌కు ఒకే ఒక్క కారణం లేదు. ఈ సమస్య ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కారణాలలో జన్యుపరమైన, వాతావరణ సంబంధిత, వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి. బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా పొగిడినప్పుడు, వారిని తక్కువగా చూసినప్పుడు, లేదా మానసికంగా, శారీరకంగా వేధించినప్పుడు ఈ రుగ్మతకు దారి తీయవచ్చు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు తప్పు చేసినా, కష్టపడకుండా విజయం సాధించినా తల్లిదండ్రులు ఎక్కువగా పొగడటం వల్ల అతనికి "కృషి చేయాల్సిన అవసరం లేదు" అనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు చిన్నతనం నుంచే ఆవేశం, అంతర్గత కలహాలు, ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే కోరిక వంటి లక్షణాలు ఈ రుగ్మతకు కారణం కావొచ్చు.
చికిత్స సాధ్యమేనా?
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌కు చికిత్స చాలా సవాలుతో కూడుకున్నది. ఈ సమస్య ఉన్నవారు తరచుగా చికిత్సను మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకంటే వారు తమ సమస్యలను గుర్తించడానికి ఇష్టపడరు. అయితే, ఈ రుగ్మతతో బాధపడుతున్నవారు మెరుగుపడటం సాధ్యమే అని పరిశోధనలు చూపిస్తున్నాయి, కానీ ఇది చాలా నెమ్మదిగా, క్రమంగా జరిగే ప్రక్రియ. చికిత్సలో వాస్తవ లక్ష్యాలను పెట్టుకోవడం చాలా ముఖ్యం. తక్షణమే మార్పు వస్తుందని ఆశించకుండా, నెమ్మదిగా పురోగతి సాధించడంపై దృష్టి పెట్టాలి. చికిత్సలో ఆత్మగౌరవాన్ని మెరుగుపరుచుకోవడం, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెడతారు. అంతేకాకుండా, రోగి, వైద్యుడు ఇద్దరూ కలిసి పని చేయడం చాలా ముఖ్యం. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా ఇతర మానసిక రుగ్మతలు, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో, అన్ని సమస్యలను కలిసి పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. సరైన చికిత్స, పద్ధతులను అనుసరిస్తే, ఈ సమస్యతో బాధపడేవారు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఈ అధ్యయనం ఆశాభావం వ్యక్తం చేసింది.
వీరితో ఎలా వ్యవహరించాలి?
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులతో వ్యవహరించడం చాలా సవాలుతో కూడుకున్నది. వారిని అర్థం చేసుకుని, సులభంగా వారితో కలిసి ఉండటానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి.
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారిని అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఈ వ్యక్తులు తమలో తాము ఒక బలమైన అహంకారాన్ని చూపిస్తారు. కానీ దాని వెనుక లోతైన అభద్రతా భావం ఉంటుంది. ఈ అహంకారం, ఒత్తిడి వల్ల ఏర్పడిన ఒక కవచం లాంటిది. వారిని ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నవారిగా చూడండి, కేవలం అహంకారులని కాదు. ఇది వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
వారి మాటలు, ప్రవర్తనకు హద్దులు పెట్టండి.
వారికి అపరిమితమైన అధికారం ఇచ్చే బదులు, కొన్ని హద్దులు నిర్ణయించండి. ఉదాహరణకు, వారు మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, "దయచేసి ఇలా మాట్లాడకండి. ఇది నాకు బాధ కలిగిస్తోంది" అని శాంతంగా చెప్పండి. అయితే, ఈ హద్దులను స్పష్టంగా, స్థిరంగా పాటించడం ముఖ్యం.
సహాయం తీసుకోవడానికి ప్రోత్సహించాలి
ఈ సమస్యతో బాధపడేవారు తమకు సహాయం అవసరమని గుర్తించడం చాలా కష్టం. వారి అహంకారం దానికి అడ్డుపడుతుంది. కాబట్టి, వారికి చికిత్స తీసుకోవాలని బలవంతం చేయకుండా, "మన సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మనం కలిసి ఒక కౌన్సెలర్‌ను కలుద్దాం" అని చెప్పడం ద్వారా ప్రోత్సహించండి.
కోరుకున్నదాన్ని స్పష్టంగా చెప్పాలి
వారికి ఇతరుల భావోద్వేగాలు అంతగా అర్థం కావు. కాబట్టి, మీరు వారి నుంచి ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పండి. "నాకు బాధగా ఉంది" అని చెప్పడం కన్నా, "మీరు అలా మాట్లాడినప్పుడు నేను బాధపడ్డాను" అని నిర్దిష్టంగా చెప్పండి.
ఆరోగ్యం జర భద్రం
వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కూడా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అందుకే, మీ కోసం కొంత సమయం కేటాయించుకోండి, మీకు తోడ్పడే స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అవసరమైతే, ఒక మానసిక నిపుణుడి సహాయం తీసుకోండి. వారితో ఉన్న బంధం మీకు హానికరం అయితే, ఆ సంబంధాన్ని పునఃపరిశీలించడం ముఖ్యం.
