
అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు: సూర్యకుమార్
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అందరి దృష్టి మైదానంలో ఆటపైనే కాదు, ఆ తర్వాత చోటు చేసుకున్న 'షేక్ హ్యాండ్' వివాదంపై కూడా మళ్లింది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండానే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. దీనిపై విస్తృత చర్చలు, విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. తమ చర్యకు బలమైన కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
పాక్పై విజయం తర్వాత విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడుతూ, ‘మేము ఇక్కడ కేవలం ఆట ఆడటానికి మాత్రమే వచ్చాం. ఆ ఆట ద్వారానే వారికి సరైన సమాధానం ఇచ్చాం’ అని అన్నారు. భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘జీవితంలో క్రీడాస్ఫూర్తికి మించిన కొన్ని విషయాలు ఉంటాయి. మేము పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు. తమ విజయాన్ని సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
వివాదం ఎందుకంటే?
దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం కోసం నిలబడి ఉండగా, భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు కూడా చేసింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ పేర్కొంది.
ఈ చర్య వెనుక భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. మ్యాచ్కు ముందు గంభీర్ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘బయటి విషయాలను పట్టించుకోకండి. మీ పని కేవలం దేశం కోసం ఆడటం. పహల్గామ్లో ఏం జరిగిందో మర్చిపోవద్దు. ఎవరితోనూ హ్యాండ్షేక్ చేయకండి, మాట్లాడటానికి ప్రయత్నించకండి. బయటకు వెళ్లి, మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి, భారతదేశానికి విజయం సాధించండి’ అని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనతో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై మరోసారి రాజకీయాలు ప్రభావం చూపించాయని స్పష్టమవుతోంది.
