
అత్యధిక కాలం సీఎంగా సిద్ధరామయ్య రికార్డు: శుభాకాంక్షలు తెలిపిన డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయి నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు దివంగత ముఖ్యమంత్రి దేవరాజ్ అరస్ పేరిట ఉన్న రికార్డును సిద్ధరామయ్య అధిగమించనున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చరిత్ర పుటల్లో సిద్ధరామయ్య: డీకే శివకుమార్
మంగళవారం మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడుతూ, ఇది కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఇది గర్వకారణమైన క్షణమని పేర్కొంటూ, సిద్ధరామయ్య పేరు గతంలో ఎలా చరిత్ర పుస్తకాలలో నిలిచిందో, భవిష్యత్తులో కూడా అలాగే నిలుస్తుందని ఆయన అన్నారు. బుధవారం నాటికి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ రికార్డును అధిగమించి కర్ణాటకలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన నేతగా నిలవనున్నారు. ఇది నిజంగా ఆనందకరమైన సందర్భం. ఆయనకు నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదగాలనే ఆశ ఉంటుంది. సిద్ధరామయ్య గతంలో చరిత్రలో స్థానం సంపాదించారు, ఇకపై కూడా అలాగే కొనసాగుతారు అని అన్నారు.
తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన శివకుమార్, తాను గ్రామీణ నేపథ్యం నుంచి ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. తన మాటలను వక్రీకరించవద్దని, తన నోట మాటలు పెట్టవద్దని ఆయన మీడియాను కోరారు.
అధికార పోరుకు తెర?
కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే విషయంలో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం అర్థకాలాన్ని పూర్తిచేసిన తర్వాత ఈ అధికార పోరు మరింత తీవ్రతరమైంది. ఈ పరిణామాలతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళనతో కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. అధిష్ఠానం సూచనల మేరకు డిసెంబరులో ఇద్దరు నేతలు “బ్రేక్‌ఫాస్ట్ డిప్లొమసీ” ద్వారా ఐక్యతను ప్రదర్శించారు. దీంతో ప్రభుత్వంలో అంతర్గత విభేదాలపై ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది.
బళ్లారి ఘటనపై స్పందన
ఇక బళ్లారి జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కూడా డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పుల ఘటన చోటుచేసుకుని ఒక కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శివకుమార్ మాట్లాడుతూ, “బళ్లారిలో మాకు శాంతి కావాలి. అక్కడి ప్రజలు గతంలోనే చాలా బాధపడ్డారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి సమస్యలు రావద్దు” అని స్పష్టం చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా డీ. దేవరాజ్ ఉర్స్ రికార్డును సమం చేసిన సందర్భంగా, తన రాజకీయ ప్రయాణంపై, ప్రభుత్వ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన దేవరాజ్ ఉర్స్ సాధించిన రికార్డుకు సమానంగా 2,792 రోజుల పాటు సీఎంగా పనిచేసిన నేతగా నిలిచారు.
రికార్డుల కోసం రాలేదు.. ఇది ప్రజల ఆశీర్వాదం: సీఎం
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య, తాను పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయగలనన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. అయితే, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. నేను రికార్డులు సృష్టించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. ఇది పూర్తిగా ఒక యాదృచ్ఛికం. దేవరాజ్ ఉర్స్ ఎంతకాలం సీఎంగా ఉన్నారో కూడా నాకు ముందుగా తెలియదు. ప్రజల ఆశీర్వాదాల వల్లనే ఈ రోజు ఆ రికార్డును చేసే అవకాశం నాకు లభించింది. రేపు అది అధిగమించబడుతుంది అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సగం పదవీకాలం పూర్తైన తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందన్న ఊహాగానాల నడుమ ఈ రికార్డు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2023లో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కుదిరిన ‘అధికార భాగస్వామ్య ఒప్పందం’ నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే, ఈ అంశంపై తాను ఎలాంటి ఆందోళనకు లోనుకావడం లేదని సిద్ధరామయ్య తెలిపారు.
తన రాజకీయ జీవితంపై మాట్లాడిన సిద్ధరామయ్య, తాను మొదట్లో ఎమ్మెల్యే కావాలన్న ఆలోచన కూడా పెద్దగా లేదని అన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాను, ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. మంత్రి అయ్యాను, ఉప ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నేతగా పనిచేశాను, చివరకు ముఖ్యమంత్రి అయ్యాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల సేవకు ఉపయోగించుకున్నాను అని చెప్పారు.
పదవీ కాలంపై ఉత్కంఠ: హైకమాండ్ నిర్ణయమే ఫైనల్!
తాను పూర్తి కాలం సీఎంగా కొనసాగగలనన్న నమ్మకం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, “నాకు నమ్మకం లేకపోతే నేను ముఖ్యమంత్రిగా ఎలా ఉండగలుగుతాను? కానీ చివరికి అన్నీ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి” అని చెప్పారు. అధిష్ఠానం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇటీవల మైసూరులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌తో జరిగిన భేటీపై కూడా సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. వేణుగోపాల్ వయనాడ్ నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో మైసూరులో ఆగిన సందర్భంగా తాను కూడా అక్కడే ఉండటంతో ఈ భేటీ జరిగిందని తెలిపారు. ఆ సమావేశంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (క్యాబినెట్ రిజిగ్) అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అధిష్ఠానం పిలిస్తేనే ఆ అంశంపై చర్చిస్తాను అని ఆయన అన్నారు.
దేవరాజ్ ఉర్స్ పదవి కాలం
డీ. దేవరాజ్ ఉర్స్ కర్ణాటకలో సామాజిక న్యాయం, భూసంస్కరణల ప్రతీకగా గుర్తింపు పొందిన నేత. ఆయన 1972 మార్చి 20 నుంచి 1977 డిసెంబర్ 31 వరకు తొలి విడతలో 2,113 రోజులు, ఆ తర్వాత 1978 ఫిబ్రవరి 28 నుంచి 1980 జనవరి 7 వరకు రెండో విడతలో 679 రోజులు సీఎంగా పనిచేశారు. మొత్తం మీద ఆయన 2,792 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.
సిద్ధరామయ్య పదవి కాలం
సిద్ధరామయ్య తన తొలి విడతలో 2013 మే 13 నుంచి 2018 మే 15 వరకు 1,829 రోజులు సీఎంగా పనిచేశారు. రెండో విడతలో 2023 మే 20 నుంచి ఇప్పటివరకు 963 రోజులు పూర్తి చేశారు. ఈ రెండు విడతల కాలాన్ని కలిపి, మంగళవారం నాటికి ఆయన దేవరాజ్ ఉర్స్ రికార్డును సమం చేశారు.
తాను, దేవరాజ్ ఉర్స్ ఇద్దరూ మైసూరు ప్రాంతానికి చెందిన వారమేనని, అయితే వేర్వేరు కాలాల్లో పనిచేశామని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఉర్స్ 1972 నుంచి 1980 వరకు సీఎంగా ఉన్నారు. నేను 2013-18, 2023 నుంచి ఇప్పటివరకు రెండు విడతల్లో సీఎంగా ఉన్నాను. ఇకపై ఏం జరగాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుంది అని అన్నారు.
తన రాజకీయ ప్రయాణం పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని, ప్రజలకు సేవ చేయడమే తనకు నిజమైన ఆనందమని సిద్ధరామయ్య చెప్పారు. రాజకీయాలంటే పేదలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం. సమాజంలో అసమానతలు పూర్తిగా తొలగే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు.
నాటు కోడి పలావ్ 'విలేజ్ బ్రాండ్'
ఇక సిద్ధరామయ్య అభిమానులు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో విందులు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు ఇష్టమైన ‘నాటు కోడి’ (దేశీ కోడి) వంటకాలతో విందులు పెట్టారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య, తాను ‘నాటు కోడి’కి బ్రాండ్ అంబాసిడర్‌లా మారినట్టు తనకు తెలియదని సరదాగా వ్యాఖ్యానించారు. నేను గ్రామం నుంచి వచ్చినవాడిని. మా ఊళ్లలో బంధువులు వచ్చినప్పుడు నాటు కోడి, రాగి ముద్దే వండటం సహజం. అప్పట్లో ఎక్కువగా తిన్నాను, ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ నేను ముఖ్యమంత్రి కావడంతో దీనికి ప్రచారం వస్తోంది అని ఆయన అన్నారు.
