
అతిషి సభలో క్షమాపణలు చెప్పాలి: స్పీకర్
ఢిల్లీ శాసనసభలో ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషీ చేసినట్లు ఆరోపణలున్న సిక్కు గురువులపై అవమానకర వ్యాఖ్యల విషయంలో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై ఆమెకు చివరి అవకాశం ఇస్తున్నామని, సభ ముందు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా శనివారం స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన స్పీకర్ గుప్తా, ఈ వివాదానికి సంబంధించిన శాసనసభ ఆడియో–వీడియో రికార్డులపై చేసిన ఫోరెన్సిక్ పరీక్షలో ఎలాంటి తారుమారు జరగలేదని ఢిల్లీ అసెంబ్లీ ఆదేశించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక తేల్చిందన్నారు.
ఈ అంశంపై శాసనసభ ఏకగ్రీవ నిర్ణయంతో రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని, ఫ్రేమ్ బై ఫ్రేమ్ శాస్త్రీయ పరిశీలనలో ఎలాంటి టాంపరింగ్ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ తేల్చిందన్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఆదేశాలతో ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతున్న సమయంలో పంజాబ్‌లో సమాంతరంగా మరో ఫోరెన్సిక్ పరీక్ష జరగడంపై స్పీకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియకు అనుమతి ఎవరు ఇచ్చారు? ఆధారాల పరిరక్షణ (చెయిన్ ఆఫ్ కస్టడీ) పాటించారా? అనే విషయాలు స్పష్టంగా లేవని విమర్శించారు. పంజాబ్ కోర్టు జారీ చేసిన ఆదేశం కేవలం మధ్యంతర ఉత్తర్వేనని, దాన్ని తుది తీర్పులా ప్రచారం చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధించే అధికారం మేజిస్ట్రేట్ కోర్టుకు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆప్ నాయకురాలు అతిషికి సభలో తన వైఖరి చెప్పేందుకు తగిన అవకాశాలు ఇచ్చినా ఆమె హాజరు కాలేదని గుప్తా తెలిపారు. ఈ ఘటన సిక్కు గురువుల పట్ల ఉన్న గౌరవానికి భంగం కలిగించేదిగా మారిందని వ్యాఖ్యానించారు. అతిషి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సభ ముందు క్షమాపణ చెప్పేందుకు ఇది చివరి అవకాశమని హెచ్చరించారు. ఈ కేసులో నిజాలు వెలికితీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
