Let's talk: editor@tmv.in
అతిషి వీడియో వివాదంలో కేసు పత్రాలు ఇవ్వండి: ఢిల్లీ అసెంబ్లీ

అతిషి వీడియో వివాదంలో కేసు పత్రాలు ఇవ్వండి: ఢిల్లీ అసెంబ్లీ

Pinjari Chand
15 ఫిబ్రవరి, 2026

ప్రతిపక్ష నేత అతిషిపై నమోదైన వీడియో వివాదం కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఢిల్లీ అసెంబ్లీ మరోసారి పంజాబ్ అధికారులను కోరింది. ఈ కేసు పంజాబ్‌లోని జలంధర్ లో నమోదైంది. శుక్రవారం అసెంబ్లీ కార్యాలయం పంజాబ్ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తదితరులకు లేఖ రాసి ఫిబ్రవరి 20లోగా సమాధానాలు ఇవ్వాలని సూచించింది. జలంధర్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రతులు, దాని ఆధారంగా నమోదైన ఫిర్యాదు పత్రం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, సోషల్ మీడియా నిపుణుల నివేదికలు, పోలీసుల సాంకేతిక విభాగం నివేదికలను సమర్పించాలని కోరింది. ఈ వివాదం జనవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో అతిషి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలతో ప్రారంభమైంది. ఆమె సిక్కు గురువులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ అసెంబ్లీ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇదే సమయంలో, పంజాబ్ పోలీసులు ఆ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం ఆ వీడియో ‘డాక్టర్డ్’ అని పేర్కొంది. అయితే తరువాత స్పీకర్ విజేందర్ గుప్తా ఆదేశాల మేరకు వీడియోను మరోసారి ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా, ఈసారి విడుదలైన నివేదికలో వీడియోతో ఎలాంటి తారుమారు చేయడం జరగలేదని పేర్కొంది. ప్రివిలేజెస్ కమిటీ ఎదుట అతిషి తన వాదనలు వినిపించారు., తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ అసెంబ్లీ అసలు రికార్డింగ్స్‌ను అందించాలని డిమాండ్ చేశారు.

పంజాబ్ అధికారులకు పంపిన లేఖలో అసెంబ్లీ కార్యాలయం, నిర్దేశిత గడువులోగా పత్రాలు అందించకపోతే అది ప్రివిలేజ్ ఉల్లంఘనగా, అసెంబ్లీ అవమానంగా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంతకుముందే ఫిబ్రవరి 12లోగా సమాధానాలు ఇవ్వాలని కోరినప్పటికీ ఇప్పటివరకు అవసరమైన సమాచారం అందలేదని పేర్కొంది. ప్రివిలేజ్ అంశాలు సంబంధిత వ్యక్తిగత అధికారులకు సంబంధించినవే. ఇది శాఖల మధ్య పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలుగా పరిగణించరాదు. గడువు లోపు సమాధానం ఇవ్వకపోతే క్షమించరానిదని లేఖలో పేర్కొంది. ఈ అంశం ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.