Let's talk: editor@tmv.in
అతివిశ్వాసమే కొంపముంచింది: సునీల్ గవాస్కర్

అతివిశ్వాసమే కొంపముంచింది: సునీల్ గవాస్కర్

Shaik Mohammad Shaffee
24 ఫిబ్రవరి, 2026

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా 12 విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు సౌతాఫ్రికా గట్టి షాకిచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత బ్యాటర్లు అతివిశ్వాసంతో వ్యవహరించారని, కనీసం ప్రత్యర్థి జట్టు ఎలా ఆడిందో గమనించకుండా వికెట్లు పారేసుకున్నారని ఆయన విమర్శించారు. అహంకారాన్ని వీడి, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే విజయానికి మార్గమని గవాస్కర్ సూచించారు.

‘సౌతాఫ్రికాను చూసి నేర్చుకోవాల్సింది’

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బ్రెవిస్, మిల్లర్ నిర్మించిన భాగస్వామ్యమే భారత్ విజయానికి దిక్సూచి కావాల్సింది. పిచ్ కఠినంగా ఉన్నప్పుడు ఎలా ఆడాలో వారు నిరూపించారు. కానీ భారత బ్యాటర్లు ఏ బంతికి పడితే ఆ బంతిని బౌండరీకి పంపాలనే తొందరపాటుతో వికెట్లు కోల్పోయారు. 9.5 పరుగులు అవసరమైన చోట, 15 పరుగుల రేటుతో ఆడే ప్రయత్నం చేయడం టీ20 క్రికెట్ కాదని గవాస్కర్ తేల్చి చెప్పారు. పవర్‌ప్లేలో 70 పరుగులు చేయక్కర్లేదని, 55-60 పరుగులు చేసినా మంచి పునాది పడేదని ఆయన విశ్లేషించారు.

తిలక్, ఇషాన్ వైఫల్యం.. రివ్యూ అవసరం

టాప్-3 బ్యాటర్ల వైఫల్యం భారత పతనాన్ని శాసించింది. ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే నిష్క్రమించడం, అభిషేక్ శర్మ వరుసగా డకౌట్లు కావడం జట్టుపై ఒత్తిడి పెంచింది. తిలక్ వర్మ వంటి తెలివైన బ్యాటర్ కూడా ఈ మ్యాచ్‌లో బాధ్యతారాహిత్యంగా ఆడటం నిరాశపరిచిందని గవాస్కర్ అన్నారు. జట్టులో మార్పుల విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు. సుందర్‌ను జట్టు సరిగ్గా వాడుకోవడం లేదని, గత రెండు మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదని, అక్షర్ రాక జట్టుకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అర్ష్‌దీప్ సింగ్ మంచి ఫామ్‌లో ఉన్నందున అతడిని కొనసాగించడం మంచిదని గవాస్కర్ పేర్కొన్నారు.

అతివిశ్వాసమే కొంపముంచింది: సునీల్ గవాస్కర్ - Tholi Paluku