Let's talk: editor@tmv.in
అతివలకు అన్యాయమేనా?

అతివలకు అన్యాయమేనా?

FL - TRND
27 సెప్టెంబర్, 2025

ఇంటి తలుపులు దాటి ఆఫీస్‌కి చేరుకోవడమే గగనమైపోతున్న రోజులివి..! అవును..! మళ్లీ పాత కాలమే గుర్తొస్తోంది. మహిళలు నిదానంగా మళ్లీ ఇంటి పనులకే పరిమితమయ్యే రోజులు వస్తున్నాయి. ఇది లెక్కలు చెబుతున్న వాస్తవం. ప్రతి 100 మందిలో 26 మంది మాత్రమే ఉద్యోగాలకు వెళ్తున్నారు. అందులో 8 శాతం మంది మాత్రమే సీఈవో స్థాయికి చేరుతున్నారు. అంటే మహిళల్ని అణగదొక్కే కార్యక్రమం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్నామని.. ఆడవాళ్లు బయటకు వచ్చి పని చేస్తున్నారని చెబుతున్నదాంట్లో సగం నిజమే ఉంది. కొన్ని దశాబ్దాల ముందు నాటితో పోల్చితే మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగినా ఆశించిన స్థాయిలో ఆ సంఖ్య లేదని అర్థమవుతుంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, మహిళలు ఇప్పటికీ శ్రామిక శక్తిలో 26 శాతం మాత్రమే ఉన్నారని, వరుసగా మూడు సంవత్సరాలుగా ఈ సంఖ్య మారలేదని కుండబద్దలు కొట్టింది. అంటే.. మూడేళ్లగా సంఖ్య మారలేదంటే గ్రోత్‌ ఏమున్నట్టు?

నిజానికి ఇటివలీ కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయాలని బలంగా కోరుకుంటున్నారు. చదువు పూర్తయిన వెంటనే జాబ్‌లో చేరుతున్నారు కూడా. అయితే ఇక్కడే పెళ్లి రూపంలో తొలి అడ్డంకి వస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్‌ కంటిన్యూ చేయవచ్చని తల్లిదండ్రులు సైతం మహిళలను మభ్యపెడుతున్నారన్న విమర్శలున్నాయి. చివరకి పెళ్లి చేసుకున్నాక.. పిల్లల బాధ్యతంతా తల్లిపైనే పడుతోంది. ఆ సమయంలో లీవ్‌లు పెట్టడం లేదా ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి వస్తోంది. కొన్నాళ్ల పాటు పిల్లలతో గడిపిన సమయం, గర్భధారణలో గడిపిన నెలలు ఉద్యోగంలో గడిపిన సంవత్సరాలను చెరిపేస్తున్నాయి. తిరిగి ఆఫీస్‌కి వచ్చిన స్త్రీలకు మంచి బాధ్యతలు ఇవ్వడం లేదు. చిన్నచిన్న పనులు మాత్రమే అప్పగిస్తున్నారు. దీంతో వారి కెరీర్ ప్రవాహం ఆగిపోతుంది. ఒకవేళ వీటిని తట్టుకోని నిలబడి పైకి ఎదిగినా పదవులు మాత్రం దక్కడంలేదు. కంపెనీలో పెద్దస్థాయికి వెళ్లే అర్హత ఉన్నా మహిళలకు అన్యాయమే జరుగుతోందని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా నివేదిక చెబుతోంది. గ్రూప్‌ పాలిటిక్స్‌, ఫ్రెండ్‌షిప్‌, కాఫీ టేబుల్ దగ్గర జరిగే మాటలే మగవారికి అవకాశాలు తెస్తుంటే స్త్రీలు మెల్లగా పక్కబాట పడిపోతున్నారు.

కంపెనీలు బయటకు డైవర్సిటీ అని నినదిస్తుంటాయి, పాలసీలు కాగితాలపై మెరిసిపోతుంటాయి. కానీ వాస్తవం మాత్రం పూర్తిగా వేరే. పని చేసినా, పని చేయకున్నా పని చేస్తున్నట్టు కనిపించేవారికే విలువ దక్కుతుందన్న చేదు నిజాన్ని నివేదిక బయటపెట్టింది. మేనేజర్ కంటికి ఎప్పుడూ కనిపించే వాళ్లకే ప్రమోషన్ వస్తుంది. గుడ్‌మార్నింగ్‌లు, గుడ్‌ఈవెనింగ్‌లు చెప్పాలి. టీమ్‌ వర్క్, సహనం, సమన్వయం లాంటివి ఏమీ పట్టించుకోరు. ఇంట్లో నుంచే రాత్రింబగళ్లు కష్టపడిన మహిళల పనిని ఎవరూ చూడరు. కానీ క్యాంటీన్‌లో తిరిగిన మగవారి ముఖం మాత్రం అందరికీ గుర్తుంటుంది. బయటకి కంపెనీ సమానత్వం ఉందని చెబుతుంది కానీ లోపల మాత్రం పాత పక్షపాతమే కొనసాగుతోంది. అందుకే సమానత్వం మాటల్లో కాదు, అవకాశాల్లో కావాలి. కొత్త తరం స్త్రీలు ఆఫీసు గోడలకే కాదు, సమాజపు ఆలోచనలకు కూడా సవాలు విసురుతున్నారు. వేదికలపై కూర్చుని.. చప్పట్లు కొడుతూ.. లేదా విమెన్స్‌డే రోజు నాలుగు వాట్సాప్‌ స్టేటస్‌లు పెడితే ఏం ఉపయోగం ఉండదు. వారిని సమానంగా నడిపించేది కేవలం నిజమైన విధానాలు, న్యాయం చేసే నియమాలు, ధైర్యంగా మార్గం చూపే కెప్టెన్సీనే.

అయితే వేతనంలోనూ మహిళలకు ప్రతీ చోటా అన్యాయమే జరుగుతోంది. శ్రమకు తగిన వేతనాన్ని మహిళలు పొందడం లేదు. ఒక ఆఫీస్‌లో పురుషునితో సమానంగా ఒకే జాబ్‌ రోల్ ఉన్నప్పటికీ మహిళలకు వచ్చే జీతం మాత్రం తక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు 100మందిలో కేవలం 26మంది మహిళలు మాత్రమే ఉద్యోగాలకు వెళ్తుండడానికి సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అసలు ఆడపిల్లలకు చదువు ఎందుకని భావించే తల్లిదండ్రులు మనకళ్లముందే కనిపిస్తుంటారు. దీనికి తోడు లైంగిక వేధింపుల సమస్య స్త్రీలకు తరతరాలుగా ఎలాగో ఉంది. స్కూళ్లు, కాలేజీలు, వర్క్‌ ప్లేస్‌ల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొవడం కొనసాగుతూనే ఉంది. జాబ్‌ కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. జాబ్‌లో ప్రమోషన్‌ కావాలంటే వేధింపులు.. ఇలాంటివి భరిస్తూ ఉద్యోగంలో కొనసాగడం చాలామందికి ఇష్టం ఉండడంలేదు. అందుకే జాబ్‌లో జాయిన్ అయిన వారు కొద్దీ కాలానికే ఇంటికి పరిమితమవుతున్నారు.

ఒకవేళ ఆఫీస్‌లో నిలబడినా, ప్రతీ అడుగులోనూ పోరాటమే. జాబ్‌లో కూర్చోవడం ఒక్కటే కాదు, మగవారు పెట్టిన రూల్స్‌తో కూడా బతకాల్సిన పరిస్థితి. ఒక్కోసారి స్త్రీ పని చేయగల సామర్థ్యాన్ని చూసే బదులు, ఆమె దుస్తులు, మాటలు, ప్రవర్తనల మీదే తీర్పు ఇస్తారు. ఒక మహిళ ప్రమోషన్‌కి అర్హత ఉన్నా, లోపల ఉన్న పాలిటిక్స్‌ వల్ల ఆమె పేరు లిస్ట్‌లో ఉండదు. ఈ అన్యాయం కనిపించనట్టే కనిపిస్తుంది, కానీ ఫలితాలు మాత్రం స్పష్టంగానే ఉంటాయి. ఇంకా భద్రత, గౌరవం కూడా మహిళలకు పూర్తిగా అందడం లేదు. ఎక్కడో సమాన వేతనం అంటూ నినదిస్తారు కానీ పే స్లిప్‌ల్లో మాత్రం తేడా స్పష్టంగా ఉంటుంది. ఇక గౌరవం గురించి ఎంతతక్కువగా మాట్లాడితే అంతమంచిది. మర్యాదగా మాట్లాడుతున్నట్టు నటిస్తారు కానీ.. వెనక మాత్రం మహిళల పర్శనల్స్‌ గురించి గాసిప్స్‌ క్రియేట్ చేస్తారు. అయినా మహిళలు ఆగిపోరు. ఒక్కొక్క స్త్రీ ఒక్కో అడుగు వేసినప్పుడే ఆ మార్గం వెనుక వందల మందికి ధైర్యం వస్తుంది. నిన్న 26మంది మాత్రమే ఉద్యోగానికి వెళ్లినా, రేపు ఆ సంఖ్య 50కి చేరుకోవాలి. నిన్న 8మంది మాత్రమే సీఈఓ స్థాయికి ఎదిగినా, రేపు 80మందిని చూడాలి. ఇది కల కాదు, ఇది హక్కు.

కాబట్టి సమానత్వం కేవలం ప్రసంగాల్లో కాదు, ప్రాక్టికల్‌గా కనిపించాలి. మహిళల కోసం నిజమైన విధానాలు, సురక్షిత వాతావరణం, సమాన వేతనం, న్యాయమైన ప్రమోషన్ సిస్టమ్ ఏర్పడాలి. అప్పుడే ఆఫీసు గోడలపై రాసే ప్రతి నినాదానికి అర్థం ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడే స్త్రీకి మొదటి ప్రమోషన్‌ చివరిది కాకుండాపోతుంది. అది నిజమైన ఆరంభం అవుతుంది. సమాజం ఎదగాలంటే మహిళల కాళ్లు ఆగకూడదు, మెట్లు విరగకూడదు, తలుపులు మూసుకుపోకూడదు. అదే నిజమైన విప్లవం. మరి ఆ విప్లవానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చూడాలి మరి!

అతివలకు అన్యాయమేనా? - Tholi Paluku