Let's talk: editor@tmv.in
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు

Dr.Chokka Lingam
26 సెప్టెంబర్, 2025

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా రాష్ట్రాల మధ్య జలవివాదాలకు పరిష్కారం లభించడం లేదు. నదీజలాల విషయమై దేశంలో కొన్ని రాష్ట్రాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల విషయంలో అనేకమార్లు వివాదాలు, విభేదాలు నెలకొన్నాయి. తెలుగురాష్ట్రాలకు, కర్ణాటకకు మధ్య ఇప్పుడు మరోసారి ఆల్మట్టి ఎత్తు పెంపుపై గొడవ మొదలయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచాలనకున్నప్పుడు అప్పటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నెలకొని రాజకీయరూపుదాల్చింది. అయినప్పటికీ కర్ణాటక అనుకున్నట్టుగానే ఆల్మట్టి ఎత్తును పెంచేసి తన రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటి విషయంలో లాభం కలిగించుకుంది. మొదట ఆల్మట్టి ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 1995సంవత్సరంలో నీటినిల్వకు సంబంధించి పూర్తిస్థాయి సామర్థ్యం 1705 అడుగులు. రెండో దశలో 2,000సంవత్సరంలో దీన్ని 1715 అడుగులకు పెంచారు. మూడో దశలో 2005 సంవత్సరం నాటికి 1720 అడుగులకు పెంచారు. మూడో దశలో ఆల్మట్టి ఎత్తు పెంపును అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా నెలకొన్న వివాదం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకోవడం. ఇప్పుడు కర్ణాటక కొత్తగా ఆల్మట్టి ఎత్తును పెంచడం లేదు. గతంలో పెంచిన ఎత్తుకు సరిపడా నీటిని నిల్వచేసుకునే సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలనుకుంటోంది. అంతకుముందు కూడా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1720అడుగులయినప్పటికీ ఆ స్థాయిలో నీళ్లును ప్రాజెక్టులో ఉంచేవారు కాదు. 207టీఎంసీల వరకు మాత్రమే నీరు ప్రాజెక్టుకు చేరేది. ఇప్పుడు 303టీఎంసీల మేరకు నీటిని నిల్వ చేయగలిగేలా భూసేకరణ చేయాలని భావిస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుకు కర్ణాటక ప్రభుత్వం 2025 సెప్టెంబరు 17న అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 1.33లక్షల ఎకరాల భూమిని సేకరించనున్నారు.

కర్ణాటక ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడిన వెంటనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగురాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం నీరు చేరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాజలాలు కావాల్సిన స్థాయిలో అందవు. భారీ వర్షాలు పడి ఎగువనుంచి పూర్తిస్థాయి నీరు చేరి ఆల్మట్టి మొత్తం నిండి దిగువరాష్ట్రాలకు నీరు చేరడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల సాగు ఆలస్యమవుతుంది. అసలు ఆల్మట్టి మొత్తం నిండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సరిపడా నీరురావడం ఏటా సాధ్యమయ్యేపనికాదు. భౌగోళికంగా దిగువున ఉన్న రాష్ట్రాలకు నదీజలాల విషయంలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో నష్టాలూ ఉంటాయి. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ప్రయోజనాలేమీ పొందలేని స్థితికి, నష్టాలు భరించాల్సిన స్థితికి అనివార్యంగా వెళ్లిపోతుంది. ఇది తెలుగు రాష్ట్రాల్ల సాగు, తాగునీటి సంక్షోభానికి కారణమవుతుంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్రకు 560టీఎంసీలు, కర్ణాటకకు 700టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800టీఎంసీల నీరు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 512టీఎంసీలు, తెలంగాణకు 299టీఎంసీల నీరు కేటాయించారు. కృష్ణాజలాల విషయంలో నాగార్జున సాగర్, శ్రీశైలంలో తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలో పదేళ్లగా తెలుగు రాష్ట్రాల మధ్య ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఆల్మట్టి వివాదం రెండు రాష్ట్రాలకు కొత్త తలనొప్పిగా మారనుంది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి విషయంలో గందరగోళపరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి జలాల విషయంలోనూ తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక వైఖరి నెలకొంది. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడంపై పదేళ్లగా పంచాయితీ నడుస్తూనే ఉంది. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య పెద్ద సమస్యగా మారింది. బనకచర్లను అడ్డుకుని తీరతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంటే, తెలంగాణకు నచ్చజెప్పి ప్రాజెక్టును నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం అంటోంది. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల నిర్మించాలని భావిస్తోంది. గోదావరి జలవివాద ట్రిబ్యునల్ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఎగువ ప్రాజెక్టుల వల్ల కృష్ణాజలాలు ఏపీకి సరిగ్గా అందడం లేదని, గోదావరి నుంచి ఏటా 2వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, కనీసం ఇందులో రెండువందల టీఎంసీల వరద జలాలను గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించాలన్నది ఏపీ ప్రభుత్వం ఉద్దేశం. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రెండో దశలో నాగార్జునసాగర్‌ను చేర్చడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. మొదట పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణానదికి, ఆ జలాలను నాగార్జున సాగర్‌కు, అక్కడినుంచి బనకచర్లకు తరలించే ప్రతిపాదనను తెలంగాణ ఒప్పుకోవడం లేదు. గోదావరి నికరజలాలతో సంబంధం లేకుండా మిగులు జలాలను ఉపయోగించే ప్రాజెక్టుపై తెలంగాణకు అభ్యంతరమేంటన్నది ఏపీ ప్రభుత్వం వాదన. ఇది ప్రస్తుతం ఎటూ తేలకుండా ఉంది. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, హంద్రీనీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలున్నాయి.

నిజానికి జలవివాదాలు రాష్ట్రాల మధ్య మంచిది కాదు. ఇవి చాలాసార్లు రాజకీయ సమస్యలుగానూ మారాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల సమస్య ఎన్నోఏళ్లగా నలుగుతోంది. తమిళనాడు, కేరళ మధ్య ముల్లపెరియార్ డ్యామ్‌పై దశాబ్దాలుగా వివాదం కొలిక్కిరావడం లేదు.

జలవివాదాలు ముదిరితే రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడతాయి. వాటికి రాజకీయ కారణాలు తోడైతే పరిస్థితులు నియంత్రణ తప్పుతాయి. అందుకే ఎప్పటికప్పుడు రాష్ట్రాలు నీటిసమస్యలను పరిష్కరించుకోవాలి. కేంద్రం మధ్యవర్తిగా నిలిచి వీటికి పరిష్కారాలు చూపాలి. మిగులు జలాల విషయంలో దిగువరాష్ట్రాలకు ఉన్న సౌలభ్యంలో వాటా పొందేందుకు ఎగువరాష్ట్రాలు ప్రయత్నించడం ఘర్షణాత్మక వైఖరి. వరదజలాలతో ఊళ్లకు ఊళ్లు మునిగిపోయే దుస్థితి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎదుర్కొంటుంటాయి. వరద బాధను దిగువరాష్ట్రాలకు నెట్టేసి, సౌలభ్యాన్ని మాత్రం తామూ పొందాలనుకోవడం ఎగువరాష్ట్రాల అవకాశవాద వైఖరిని ప్రతిబింబిస్తుంది. కేంద్రప్రభుత్వం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సాధారణ ప్రజలు, రైతుల తాగునీటి, సాగునీటికి సంబంధించిన అన్ని అవసరాలు తీర్చేలా జలకేటాయింపులు జరపాలి. నీటి లెక్కల్లోకి రాజకీయ సమీకరణాలు తీసుకొస్తే అది రాష్ట్రాల మధ్య ఎప్పటికీ ఆరని రావణకాష్టమవుతుంది.

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు - Tholi Paluku