Let's talk: editor@tmv.in
అణ్వాయుధాల పెంపునకు ఫ్రాన్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌

అణ్వాయుధాల పెంపునకు ఫ్రాన్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

దశాబ్దాల కాలంగా అనుసరిస్తున్న తన రక్షణ వ్యూహాన్ని ఫ్రాన్స్‌ సమూలంగా మార్చివేస్తోంది. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో తమ అణు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఫ్రాన్స్‌ నిర్ణయించింది. 1992 తర్వాత మొదటిసారిగా తమ అణు వార్‌హెడ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం అట్లాంటిక్ తీరంలోని 'ఇల్ లాంగ్' సబ్‌మెరైన్ బేస్ నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ చారిత్రక నిర్ణయాలను వెల్లడించారు.

స్వయం సమృద్ధి దిశగా ఐరోపా అడుగులు

బ్రిటన్ నిష్క్రమణ తర్వాత యూరోపియన్ యూనియన్‌లో అణు శక్తి కలిగిన ఏకైక దేశంగా ఫ్రాన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐరోపా దేశాలు రక్షణ కోసం అమెరికా అందించే 'అణు గొడుగు'పైనే ఆధారపడుతూ వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి ఐరోపా నేతల్లో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో "ఐరోపా ప్రజలు తమ విధిని తామే శాసించుకోవాలి" అని పిలుపునిచ్చిన మాక్రాన్, ఫ్రాన్స్‌ అణు సామర్థ్యాన్ని యూరప్ భద్రతకు అనుసంధానం చేస్తామన్నారు.

ఐరోపా దేశాలకు ఫ్రాన్స్‌ ‘అణు’ భరోసా

ఫ్రాన్స్‌ తన అణు రక్షణ విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇకపై ఫ్రాన్స్‌కు చెందిన అణు యుద్ధ విమానాలను అవసరమైనప్పుడు మిత్రదేశాల భూభాగంలో తాత్కాలికంగా ఉంచుతారు. అంతేకాకుండా జర్మనీ, పోలాండ్‌, స్వీడన్‌ వంటి దేశాలు ఫ్రాన్స్‌ నిర్వహించే అణు విన్యాసాల్లో నేరుగా పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అణ్వాయుధాలు లేని దేశాల సైనికులు కూడా ఫ్రాన్స్‌ బలగాలతో కలిసి శిక్షణ పొందేలా నిబంధనలు మార్చారు. అమెరికాపై ఆధారపడకుండా, ఐరోపా దేశాలన్నీ కలిసికట్టుగా ఒకే రక్షణ కవచంలా ఏర్పడి శత్రువుల దాడులను ఎదుర్కోవడమే ఈ సరికొత్త వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

జర్మనీ, పోలాండ్‌లతో ఒప్పందం

ఈ ప్రకటనను ఐరోపా దేశాలు స్వాగతించాయి. అణు నిరోధక అంశాలపై చర్చించేందుకు ఫ్రాన్స్-జర్మనీ సంయుక్తంగా ఒక 'స్టీరింగ్ గ్రూప్'ను ఏర్పాటు చేశాయని జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ వెల్లడించారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. "శత్రువులు మనపై దాడి చేసే సాహసం చేయకుండా మిత్రదేశాలతో కలిసి మేం ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాం" అని పేర్కొన్నారు.

నిర్ణయాధికారం ఫ్రాన్స్‌దే!

అణు సహకారాన్ని విస్తరించినప్పటికీ, ఆ ఆయుధాలను ప్రయోగించే తుది నిర్ణయాధికారం మాత్రం కేవలం ఫ్రాన్స్ అధ్యక్షుడి వద్దే ఉంటుందని మాక్రాన్ స్పష్టం చేశారు. "స్వేచ్ఛగా ఉండాలంటే, అందరికీ భయం కలిగించే శక్తి ఉండాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ వద్ద ప్రస్తుతం సుమారు 290 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. రష్యా, అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద అణు దేశంగా ఫ్రాన్స్ కొనసాగుతోంది.

ఫ్రాన్స్‌ అణు శక్తి

ఫ్రాన్స్‌ తన అణు అమ్ములపొది కోసం ఏటా దాదాపు 5.6 బిలియన్ యూరోలను వెచ్చిస్తోంది. ఆ దేశ అణు త్రివిధ దళాల సామర్థ్యం ప్రధానంగా నాలుగు శక్తివంతమైన బాలిస్టిక్ సబ్‌మెరైన్లపై ఆధారపడి ఉంది. వీటితో పాటు అణు ప్రయోగ సామర్థ్యం గల రాఫెల్ యుద్ధ విమానాలు, సముద్రంపై నుంచి దాడులు చేయగల చార్లెస్ డి గల్లె విమాన వాహక నౌక ఫ్రాన్స్‌ రక్షణ కవచంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

విమర్శలు.. ఆందోళనలు

మరోవైపు మాక్రాన్ నిర్ణయంపై అంతర్జాతీయ అణు ఆయుధాల నిర్మూలన సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అణు వ్యాప్తి నిరోధక ఒప్పందానికి విరుద్ధమని, రష్యా దీన్ని ఒక కవ్వింపు చర్యగా భావించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ఇది నాటో కార్యకలాపాలకు అనుబంధంగానే ఉంటుందని ఫ్రాన్స్ స్పష్టం చేసింది.