Let's talk: editor@tmv.in
అణు బెదిరింపులకు ఇక భయపడం: పాకిస్థాన్‌కు వెస్ట్రన్ కమాండ్ హెచ్చరిక

అణు బెదిరింపులకు ఇక భయపడం: పాకిస్థాన్‌కు వెస్ట్రన్ కమాండ్ హెచ్చరిక

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

పాకిస్థాన్ అణు బెదిరింపులకు ఇక భారత్ లొంగదని, అవసరమైతే ’ఆపరేషన్ సిందూర్ 2.0‘ తో మరింత కఠినంగా ప్రతిస్పందిస్తామని భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గురువారం హెచ్చరించారు. పఠాన్‌కోట్‌లో జరిగిన ప్రత్యేక ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయం కేవలం సంబరానికి మాత్రమే కాకుండా భవిష్యత్తు సన్నద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మేము వారి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపాం. వారు ప్రతిదాడి చేయగా, మేము వారి సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేశాం. చివరికి వారు యుద్ధ విరమణ కోరారు. ఈసారి ప్రతిస్పందన మరింత బలంగా ఉంటుందని కటియార్ తీవ్రంగా మాట్లాడారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ అణు యుద్ధ బెదిరింపులను బలహీనత నుంచి వచ్చిన బ్లఫ్ గా ఆయన కొట్టిపారేశారు. అణు బెదిరింపులకు మేం భయపడమని స్పష్టం చేశారు. ఈసారి చర్యలు కేవలం ఉగ్రవాద శిబిరాలు లేదా ఎయిర్ బేస్‌లకే పరిమితం కావని హెచ్చరించారు. విజయం అంతటి స్థాయిలో ఉంటుంది, ప్రపంచం ముందు వారు మోకాళ్లపై నిలబడాల్సి వస్తుందని అన్నారు.

2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించగా, దానికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై లక్ష్యిత దాడులు జరిపినట్లు సైన్యం తెలిపింది. ఈ దాడులు లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ నిర్వహిస్తున్న స్థావరాలపై జరిగాయని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా 2025 మే 7, 8, 9 తేదీల్లో పాకిస్థాన్ భారత నగరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సైన్యం 100 శాతం ఆయుధాలతో సిద్ధంగా ఉందన్నారు. అలాగే డ్రోన్ సాంకేతికతలో స్వావలంబన సాధిస్తున్నదని కటియార్ తెలిపారు. అయినప్పటికీ, భారత జవాన్‌నే అత్యంత ముఖ్యమైన శక్తి అని ఆయన పేర్కొన్నారు. భారత ఆత్మస్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖడ్గం లాగా ఎప్పుడూ వంగదని ఆయన వ్యాఖ్యానించారు.

అణు బెదిరింపులకు ఇక భయపడం: పాకిస్థాన్‌కు వెస్ట్రన్ కమాండ్ హెచ్చరిక - Tholi Paluku