Let's talk: editor@tmv.in
అణు చర్చల వేళ.. హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసిన ఇరాన్!

అణు చర్చల వేళ.. హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసిన ఇరాన్!

Shaik Mohammad Shaffee
18 ఫిబ్రవరి, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా-ఇరాన్ మధ్య జెనీవాలో మంగళవారం రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, చర్చలు మొదలైన కొద్దిసేపటికే ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని కొన్ని గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించి, లైవ్ క్షిపణి విన్యాసాలు చేపట్టింది. అమెరికా సైనిక హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఈ అంతర్జాతీయ జలమార్గాన్ని మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చర్చల వేళే క్షిపణి విన్యాసాలు

అణు చర్చలకు ముందే ఇరాన్ తన పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఆధ్వర్యంలో పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఓమన్‌ ప్రాంతాల్లో భారీ నావిక విన్యాసాలు చేపట్టింది. ఇరాన్ భూభాగం నుంచి ప్రయోగించిన క్షిపణులు హార్ముజ్ జలసంధిలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్లు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే సాగుతుండటంతో, ఇరాన్ చర్య అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది.

అమెరికా యుద్ధనౌకలను ముంచేస్తాం: ఖమేనీ

మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక శక్తిని పెంచుతున్న తరుణంలో ఇరాన్ సుమ్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో స్పందించారు. "యుద్ధనౌక ప్రమాదకరమైనదే కావచ్చు.. కానీ దానిని సముద్ర గర్భానికి పంపగల ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. అవి మరింత ప్రమాదకరమైనవి" అని ఆయన అమెరికాను హెచ్చరించారు. చర్చల ఫలితాన్ని ముందుగానే నిర్ణయించాలని చూడటం మూర్ఖత్వమని ఖమేనీ ఎద్దేవా చేశారు.

పరోక్షంగా జెనీవా చర్చలు

జెనీవాలో మంగళవారం మొదలైన రెండో రౌండ్ చర్చలు కూడా గత చర్చల తరహాలోనే పరోక్షంగా జరుగుతున్నాయి. ఈ దఫా చర్చలకు ట్రంప్ ప్రతినిధులుగా స్టీవ్ విట్‌కాఫ్‌, జారెడ్ కుష్నర్ హాజరవగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ అధిపతితో భేటీ అయ్యారు. "మేము న్యాయమైన ఒప్పందం కోసం వచ్చాము.. కానీ బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదు" అని అరఘ్చీ స్పష్టం చేశారు. ఈ చర్చలు కేవలం అణు కార్యక్రమంపైనే పరిమితమై ఉంటాయని, దేశీయ నిరసనల అంశం ఇందులో లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.

ట్రంప్ హెచ్చరిక.. అమెరికా బలగాల మోహరింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్రంగా స్పందించారు. "నేను ఈ చర్చల్లో పరోక్షంగా పాల్గొంటున్నాను, ఇవి చాలా ముఖ్యమైనవి. ఒప్పందం కుదరకపోతే వచ్చే పరిణామాలను ఇరాన్ భరించలేకపోవచ్చు" అని ఆయన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ హెచ్చరించారు. దీనికి తగ్గట్టుగానే, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ను అమెరికా మధ్యప్రాచ్యానికి తరలించింది. ఇది ఇప్పటికే అక్కడ ఉన్న ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ నౌకతో కలిసి పహారా కాయనుంది.

నిరసనల అణిచివేతపై ఆందోళన

ఇరాన్ అంతర్గతంగా కూడా తీవ్ర అశాంతితో కొట్టుమిట్టాడుతోంది. గత నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై ప్రభుత్వం జరిపిన అణిచివేతలో సుమారు 7,015 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెత్తుటి అణిచివేత జరిగి 40 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా మసీదులో జ్ఞాపక సభను నిర్వహించనుంది. అయితే ఈ అశాంతికి విదేశీ గూఢచార సంస్థలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఆంక్షల సడలింపే ఒప్పందానికి కీలకం

అణు ఆయుధాల అభివృద్ధిని అడ్డుకునే ఒప్పందాన్ని అమెరికా కోరుతుండగా, ఇరాన్ మాత్రం ఆర్థిక ఆంక్షల సడలింపే ఒప్పందానికి కీలకమని స్పష్టం చేసింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్-రవాంచీ, “బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉంది. ఆంక్షలు సడలిస్తేనే మేము ముందుకు వస్తాం” అని వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధం వల్ల చర్చలు నిలిచిపోయాయని, ఆ సమయంలో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

ఒకవైపు జెనీవాలో అణు చర్చలు సాగుతుండగా, మరోవైపు హార్ముజ్ జలసంధిలో క్షిపణి విన్యాసాలు, అమెరికా యుద్ధనౌకల మోహరింపు మధ్యప్రాచ్యంలో కొత్త సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉందనే ఆందోళనను పెంచుతున్నాయి. ఈ చర్చలు శాంతికి దారి తీస్తాయా? లేక మరో యుద్ధానికి నాంది పలుకుతాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.