Let's talk: editor@tmv.in
అణు చర్చల వేళ.. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

అణు చర్చల వేళ.. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు

Shaik Mohammad Shaffee
27 ఫిబ్రవరి, 2026

ఇరాన్‌తో అణు చర్చల వేళ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల తయారీతో పాటు అక్రమంగా చమురు అమ్ముకోవడానికి సహకరిస్తున్న 30 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై అమెరికా తాజాగా భారీ ఆంక్షలు విధించింది. జెనీవాలో చర్చల్లో ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు, ఆ దేశంపై గరిష్ఠ స్థాయిలో ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

'షాడో ఫ్లీట్' లక్ష్యంగా ఆంక్షల పర్వం

అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ఈ కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఇరాన్ చమురును రహస్యంగా తరలిస్తున్న 'షాడో ఫ్లీట్' నౌకల జాబితా ఉంది. అలాగే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు డ్రోన్లను సరఫరా చేస్తున్న 'ఖుద్స్ ఏవియేషన్ ఇండస్ట్రీస్' వంటి సంస్థలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆంక్షల వల్ల సదరు వ్యక్తులు, సంస్థలకు అమెరికాలో ఉన్న ఆస్తులు స్తంభించిపోతాయి. అంతేకాకుండా అమెరికా పౌరులు, కంపెనీలు వారితో ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపడానికి వీలుండదు.

యుద్ధనౌకల మోహరింపు

చర్చల కోసం ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ, మరోవైపు అమెరికా తన సైనిక శక్తిని కూడా భారీగా మోహరించింది. గత దశాబ్ద కాలంలో లేని విధంగా మధ్యప్రాచ్యంలో భారీ సంఖ్యలో యుద్ధనౌకలు, యుద్ధ విమానాలను ట్రంప్ సిద్ధం చేశారు. జూన్ నెలలో ఇరాన్‌కు చెందిన మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. "ఇరాన్ తన సొంత ప్రజల క్షేమం కంటే ఉగ్రవాదాన్ని, ఆయుధాల తయారీనే ఎక్కువగా ప్రేమిస్తోంది. అందుకే వారి అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే మా లక్ష్యం" అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు.

అణ్వాయుధం వద్దంటేనే డీల్!

ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమైనదని చెబుతున్నప్పటికీ, అది 60 శాతం వరకు యురేనియంను శుద్ధి చేయడంపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయమై మంగళవారం రాత్రి జరిగిన 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో ట్రంప్ ఘాటుగా స్పందించారు. "మేము వారి అణు కేంద్రాలను తుడిచిపెట్టాము, కానీ వారు మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలని చూస్తున్నారు. వారు చర్చలకు వస్తున్నారు, కానీ మాకు కావాల్సిన ఆ మాటలు (మేము ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయము) వారి నుంచి ఇంకా రాలేదు. ఆ మాట చెబితేనే ఒప్పందం సాధ్యం" అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.