
‘అణు’ ఆంక్షలకు చైనా నో
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల నియంత్రణకు రక్షణ కవచంలా ఉన్న ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం గడువు ముగియడంతో అంతర్జాతీయ భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అమెరికా, రష్యాల మధ్య అణ్వాయుధాల తగ్గింపు కోసం కుదిరిన ఈ ఒప్పందం ఫిబ్రవరి 5, 2026తో ముగిసింది. ఈ నేపథ్యంలో, చైనాను కూడా భాగస్వామిని చేస్తూ కొత్త ఒప్పందాన్ని తీసుకురావాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను చైనా స్పష్టంగా తిరస్కరించింది. అగ్రరాజ్యాల మధ్య పోటీలో తాను బాధ్యతలను స్వీకరించబోనని, పైగా తన అణు సామర్థ్యాన్ని అత్యంత వేగంగా విస్తరించుకుంటామని డ్రాగన్ దేశం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.
వేగంగా పెరుగుతున్న అణు నిల్వలు
చైనా తన అణ్వాయుధ సంపత్తిని మునుపెన్నడూ లేని విధంగా పెంచుకుంటోందని పెంటగాన్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2024 చివరి నాటికి చైనా వద్ద కనీసం 600 అణు వార్‌హెడ్‌లు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్య 1,000 దాటుతుందని అంచనా. 2025 సెప్టెంబరులో జరిగిన కవాతులో చైనా తన అధునాతన క్షిపణులైన డీఎఫ్-61, డీఎఫ్-5సీ, జేఎల్-3 వంటి ఐదు రకాల అణ్వాయుధాలను బహిరంగంగా ప్రదర్శించింది. హమి, యుమెన్ వంటి ప్రాంతాల్లో భారీ క్షిపణి సైలోలను నిర్మించడం ద్వారా అమెరికా, రష్యాలకు ధీటుగా ఎదగాలని చైనా యోచిస్తోంది.
రహస్య పరీక్షలు.. అమెరికా ఆరోపణలు
చైనా తన లాప్ నూర్ పరీక్షా క్షేత్రంలో రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో జెనీవా సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 జూన్ 22న చైనా రహస్యంగా ‘పూర్తిస్థాయి అణు విస్ఫోటన పరీక్ష’ నిర్వహించిందని, దీనిని ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు ‘డీకప్లింగ్’ అనే అధునాతన సాంకేతికతను వాడిందని ఆరోపించారు. దీనివల్ల భూకంప పర్యవేక్షణ వ్యవస్థలను సైతం చైనా మభ్యపెట్టిందని అమెరికా వాదిస్తోంది. అయితే అంతర్జాతీయ అణు పరీక్ష నిషేధ ఒప్పంద సంస్థ (సీటీబీటీఓ) మాత్రం అటువంటి పేలుడు సంకేతాలేవీ తమకు అందలేదని పేర్కొనడం గమనార్హం.
ఆయుధ నియంత్రణకు మొండిచేయి
అణ్వాయుధాల విషయంలో పారదర్శకత ఉండాలని, రష్యా-అమెరికా తరహాలోనే చైనా కూడా నియంత్రణ ఒప్పందాల్లో చేరాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పిలుపునిచ్చారు. అయితే చైనా మాత్రం ఈ ప్రతిపాదనలను ‘రాజకీయ ఎత్తుగడ’గా అభివర్ణించింది. అమెరికా తన అణు ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికే ఇతరులపై ఆంక్షలు రుద్దుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మండిపడ్డారు. అమెరికా తన దూకుడు విధానాలను వదులుకునే వరకు తాము ఎటువంటి ఒప్పందాల్లో చేరే ప్రసక్తే లేదని చైనా శ్వేతపత్రం ద్వారా స్పష్టం చేసింది.
ముంచుకొస్తున్న ముప్పు
ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా వద్ద అద్భుతమైన సూపర్ కంప్యూటర్లు ఉన్నప్పటికీ, అణు పరీక్షల డేటా తక్కువగా ఉందని, అమెరికా గనుక మళ్లీ పరీక్షలు ప్రారంభిస్తే ఆ వంకతో చైనా కూడా భారీ అణు పరీక్షలు నిర్వహించి ఆ డేటాను దక్కించుకుంటుందని డాక్టర్ జెఫ్రీ లూయిస్ హెచ్చరించారు. రష్యా, చైనాలు తమ చర్యలను సమన్వయం చేసుకుంటూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతున్నాయని, భవిష్యత్తులో ఆయుధ నియంత్రణ అనేది కేవలం చర్చలకే పరిమితం కాకుండా కఠినమైన పర్యవేక్షణతో కూడి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
