
అడ్లూరి, పొన్నం వివాదానికి తెరపడినట్టేనా?
కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు, అంతర్గత కలహాలు అత్యంత సహజం. గ్రూపు రాజకీయాలు, సొంత పార్టీ నేతలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విబేధాలు అంత తారస్థాయిలో లేవు. అక్కడక్కడా గ్రూపు రాజకీయాలు, విమర్శలు కనిపించాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత ప్రజాస్వామ్యం, అధిష్ఠానం కొందరిని ప్రోత్సహించడం వంటివి వీటికి కారణాలుగా చెబుతుంటారు. గతంలోనూ వరంగల్ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిత్య అసమ్మతి వాదిగా నిలిచిపోయారు. ఇదెలా ఉంటే తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఇవి కాస్త తీవ్రస్థాయిలో ఉండటం, దళితవాదం తెరమీదకు రావడంతో రాజకీయ దుమారం రేగింది.
వివాదం ఎక్కడ మొదలైంది?
ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ సభలో మీడియా సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి ‘దున్నపోతు’ అని వ్యాఖ్యానించినట్టు ఆరోపణలు వచ్చాయి. మంత్రి అడ్లూరి ఎంతో సీరియస్‌గా స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలతో నొచ్చుకున్నట్టు మీడియాతో అన్నారు. తాను దళితుడిని కాబట్టే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నది పొన్నం వివరణ. మరి ఈ వివాదం ఇప్పటికైనా సద్దుమణుగుతుందేమో వేచి చూడాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా అడ్లూరి లక్ష్మణ్‌కు వ్యక్తిగత క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్టుగా కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో జరిగిన మధ్యవర్తిత్వ సమావేశంలో ఇద్దరు మంత్రుల మధ్య మాటల మలుపు జరిగిందని సమాచారం.
'దున్నపోతు' వ్యాఖ్యకు అడ్లూరి ఆవేదన
పొన్నం చేసిన వ్యాఖ్యలు తన జాతి (మాదిగ)ను అవమానించేలా ఉన్నాయని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా నొచ్చుకున్నారు. "నేను తక్కువ సామాజిక వర్గానికి చెందినవాడిని అని అవమానించారు. మా జాతిని మొత్తాన్ని అవమానపరిచారు. మంత్రి అవ్వడమే నా తప్పా?" అంటూ అడ్లూరి భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సంఘటనపై సహచర మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా స్పందించకపోవడాన్ని అడ్లూరి తప్పుబట్టారు. పొన్నం మాట్లాడుతుంటే వివేక్ కనీసం ఖండించలేదు" అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ రాజకీయం
ఇక ఇద్దరు మంత్రుల మధ్య విబేధాలు వచ్చినట్టు కనిపించడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా వెంటనే అలర్ట్ అయ్యింది. ఈ వ్యాఖ్యల ఆడియోలు, వీడియోలను వైరల్ చేసి, మంత్రుల మధ్య బేధాభిప్రాయాలను ఉన్నట్టు బీఆర్ఎస్ సోషల్ మీడియా చూపించింది. ఇక అడ్లూరి ఈ వివాదంపై మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పుకున్నారు.
అడ్లూరి స్పందన ఏమిటి?
మరి ఈ వివాదం పరిష్కారం అవుతుందా? పొన్నం క్షమాపణలతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాంతిస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే పొన్నం స్పందించిన తీరుపై అడ్లూరి మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పొన్నం ఏం మాట్లాడారో మొత్తం సమాజం చూసిందని.. అయిన తన పొరపాటును ఒప్పుకోకపోవడం ఏమిటని అడ్లూరి ప్రశ్నించారు. పొరపాటును అంగీకరించి ఉంటే బాగుంటుందని చెప్పారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్న వేళ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య నెలకొన్న విబేధాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేవే అన్న చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ మధ్యవర్తిత్వంతో పొన్నం క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో దళితులు, బీసీలు, మైనార్టీలు తమ వైపుకు తిప్పుకొని రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, అందుకు అడ్లూరి తీవ్రంగా స్పందించడం గమనార్హం. ఇంకా అనేక జిల్లాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. చాలా మంది మంత్రుల మధ్య బేదాభిప్రాయలు ఉన్నా అవి పెద్దగా బయటకు రావడం లేదు. అంతా గుంభనంగా ఉన్నారు. మరి ఈ వివాదాలు ఎప్పటికి సద్దుమణుగుతాయో వేచి చూడాలి.
