Let's talk: editor@tmv.in
అడవుల పరిరక్షణే మన బాధ్యత: మంత్రి కొండా సురేఖ

అడవుల పరిరక్షణే మన బాధ్యత: మంత్రి కొండా సురేఖ

Gaddamidi Naveen
24 మార్చి, 2026

దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో 'ప్రపంచ అటవీ దినోత్సవ' వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, అడవులే మానవ జీవనానికి పునాది అని స్పష్టం చేశారు. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని గుర్తు చేస్తూ, మనం చెట్లను కాపాడితేనే అవి మనల్ని కాపాడుతాయని పేర్కొన్నారు. పెరిగిన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల అడవులు తగ్గిపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 'వనమహోత్సవం' ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోందని, ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును పెంచి సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో భాగంగా రెండు ప్రముఖ శిక్షణ సంస్థల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దూలపల్లి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, హిమాయత్ సాగర్‌లోని రాజా బహదూర్ వెంకట రామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవడం. సంయుక్త శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సామగ్రి పంపిణీ, ఫ్యాకల్టీ మార్పిడి, శాస్త్రీయ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ట్రైనీల నైపుణ్యాలను పెంచుతారు. సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒక 'సంయుక్త అకాడమిక్ బోర్డు'ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డా. సి. సువర్ణ, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ సంరక్షణతో పాటు, అధికారుల శిక్షణలో సాంకేతికతను జోడించడం ద్వారా పర్యావరణ పరిరక్షణను మరింత పకడ్బందీగా అమలు చేయవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.