
అడవులు జాతి సంపద.. ప్రతి అంగుళం అమూల్యం
అడవులు జాతీయ ఆస్తి. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయలకు తావుండదు. రాజీకి తావుండదు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవుల రక్షణ విషయంలో మార్గదర్శకం చేస్తున్నారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే, అప్పటి వ్యవస్థలో అధికారులు ఎందుకు మిన్నకుండిపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని, పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యతను అటవీ అధికారులు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అటవీ శాఖలో విభిన్నమైన బాధ్యతలు పంచుకోవడానికి సరిపడినంత సిబ్బంది లేరని ప్రతి సమీక్షలోనూ అధికారులు నా దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ సమస్య అధిగమించడానికి ఉన్న మార్గాలను కేబినెట్ ముందు ఉంచాం. సిబ్బంది నియామకం వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలి. ఎలాంటి సిఫార్సులకు తావివ్వవద్దు. అడవుల్ని సంరక్షించాలంటే అటవీ శాఖ అధికారుల భద్రత ప్రధానమైనది. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతంగా నన్ను కలిసి సమస్యను చెప్పండి. శ్రీశైలం ఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నాను. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశాం. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావివ్వవద్దు. రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు ఉన్నాయి. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చు అని అంచనా. అయితే ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్... గొప్ప ప్రయత్నం
974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత రక్షణకు మడ అడవుల పెంపకం ప్రధానం. తీరం వెంబడి ఖాళీ ప్రదేశాల్లో తాటి చెట్లు, పాల్మిరా, పాడనస్ వంటి తీర ప్రాంత జాతుల మొక్కలు పునరుద్దరణపై దృష్టి సారించి ఆకు పచ్చని గోడ నిర్మాణానికి కాల వ్యవధి పెట్టుకుని పని చేద్దామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎర్రచందనం విత్తనాలు చల్లేందుకు ప్రణాళిక
శేషాచలం అడవుల్లో 1987 ప్రాంతంలో హెలీకాప్టర్ల ద్వారా విస్తారంగా ఎర్రచందనం విత్తనాలు చల్లారు. అది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి బీజాలు వేసింది. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు మరోసారి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు విస్తారంగా చల్లే కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు.
హస్త కళలకు అవసరమయ్యే వృక్షాలు పెంచాలి
ఉడ్ బ్యాంక్స్ ఏర్పాటు, ఎకో టూరిజం మీద దృష్టి సారించాలి. పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలి. తద్వారా గిరిజన యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలి. అడవులను కాపాడుకుంటూ, గిరిజనుల జీవనాధారానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. అడవుల అందాలను ప్రజలు ఆస్వాదించే ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజంపై దృష్టి సారించాలి. అది భవిష్యత్ పర్యాటక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి ముడి కలప కొరత ఉంది. అంకుడు, తెల్ల పొనికి చెట్లను విస్తృతంగా పెంచి ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి ఇబ్బందులు లేకుండా చూడాలి. కళాకారుల అవసరానికి తగినంతగా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొండపల్లి బొమ్మల తయారీకి వినియోగించే తెల్లపొనికి చెట్ల పెంపకం సవాలుతో కూడుకున్న వ్యవహారం. అవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. వీటి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలి. ఒక పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రచార పోస్టర్లు అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు.
