
అట్లాంటిక్ మహాసముద్రంలో చమురు యుద్ధం
అట్లాంటిక్ మహాసముద్రంలో వెనిజులాకు చెందిన రెండు చమురు నౌకలను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నౌకల్లో ఒకటి రష్యా జెండాతో ప్రయాణిస్తుండటంతో, అమెరికా-రష్యాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెనిజులాపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఉల్లంఘిస్తూ చమురు తరలిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా కోస్ట్ గార్డ్, నావికాదళాలు ఈ మెరుపు ఆపరేషన్‌ను నిర్వహించాయి.
బెల్లా-1 నౌక ముట్టడి
ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రధానంగా ‘బెల్లా-1’ అనే చమురు ట్యాంకర్‌నే లక్ష్యంగా చేసుకుంది. గత కొన్ని వారాలుగా అమెరికా నిఘా కళ్లకు చిక్కకుండా దోబూచులాడిన ఈ నౌక, పట్టుబడకుండా ఉండేందుకు తన పేరును ‘మెరినెరా’గా మార్చుకుంది. పేరు మార్చినా, రూపం మార్చినా అమెరికా కోస్ట్ గార్డ్ కట్టర్ ‘మున్రో’ మాత్రం ఆ నౌకను వదిలిపెట్టలేదు. అట్లాంటిక్ మహాసముద్రమంతటా ఆ ట్యాంకర్‌ను నీడలా వెంబడించి, చివరకు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఆ నౌకను అమెరికా బలగాలు వశం చేసుకున్నాయి.
రష్యా జెండాతో నౌక.. ముదిరిన వివాదం
అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకల్లో ఒకటి రష్యా జెండాతో ప్రయాణిస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. గతేడాది డిసెంబర్ 24న రష్యా ప్రభుత్వం ఈ నౌకకు తాత్కాలికంగా తమ దేశపు జెండాను వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఆ నౌకలో రష్యాకు చెందిన సిబ్బంది కూడా ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు నేరుగా అమెరికా-రష్యాల మధ్య చిచ్చు పెట్టింది. ఇది ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీసే ప్రమాదకర పరిస్థితిని తలపిస్తోంది.
అమెరికా ఘాటు హెచ్చరిక
ఈ విజయాన్ని అమెరికా కోస్ట్ గార్డ్ తమ సామర్థ్యానికి నిదర్శనంగా పేర్కొంది. “అంతర్జాతీయ చట్టాల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసింది. వైట్ హౌస్ వర్గాల ప్రకారం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.
అమెరికా చర్యపై రష్యా నిప్పులు
ఈ ఘటనను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది సముద్రపు దొంగతనానికి సమానమని రవాణా మంత్రిత్వ శాఖ మండిపడింది. 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ప్రకారం అంతర్జాతీయ జలాల్లో ఇతర దేశాల నౌకలను బలవంతంగా ఆపడం నిబంధనలకు విరుద్ధమని రష్యా వాదిస్తోంది. స్వాధీనం చేసుకున్న నౌకలో ఉన్న తమ దేశ పౌరుల భద్రతపై మాస్కో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా దృక్పథంతో వారిని గౌరవప్రదంగా చూడాలని, ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే తమ పౌరులను స్వదేశానికి పంపాలని రష్యా విదేశాంగ శాఖ గట్టిగా డిమాండ్ చేసింది..
'ఘోస్ట్ ఫ్లీట్' గుట్టు రట్టు
షిప్పింగ్ ఇంటెలిజెన్స్ సంస్థలైన కెప్లర్, ట్యాంకర్ ట్రాకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా చేతికి చిక్కిన ఈ నౌకలు ప్రమాదకరమైన ‘ఘోస్ట్ ఫ్లీట్’ (రహస్య నౌకాదళం)లో భాగమని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి చమురును గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఈ రకమైన నౌకలను వినియోగిస్తారు. పట్టుబడిన నౌకల్లో ఒకదానిలో ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల వెనిజులా ముడి చమురు ఉన్నట్లు సమాచారం.
ముదురుతున్న దౌత్య వివాదం
వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వం పతనం కావడంతో అక్కడ రష్యా ప్రభావం తగ్గుతున్న సమయంలోనే, అమెరికా ఈ చమురు నౌకలను స్వాధీనం చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటన కేవలం అమెరికా, రష్యాల మధ్య గొడవకు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై, దేశాల మధ్య ఉండే దౌత్య సంబంధాలపై కూడా గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది సముద్రంలో జరిగిన ఏదో ఒక సాధారణ తనిఖీ కాదని, అంతర్జాతీయ స్థాయిలో తన మాటే చెల్లుతుందని నిరూపించుకోవడానికి అమెరికా పక్కా వ్యూహంతో చేపట్టిన భారీ ఆపరేషన్ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సాగర సమరం మున్ముందు ఇంకెన్ని రాజకీయ మలుపులకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి.
