
అట్టహాసంగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు
పార్లమెంట్‌లోని రాజ్యసభలో ఖాళీ అయిన 37 సీట్ల కోసం ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు మార్చి 5 చివరి రోజు కావడంతో అభ్యర్థుల సందడి నెలకొంది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో అందరి దృష్టిని ఆకర్షించిన పరిణామం బీహార్‌లో చోటుచేసుకుంది. 2005 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పాట్నాలో నామినేషన్ పత్రాలు సమర్పించిన ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఉన్నారు.
బీహార్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు
243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో ఎన్డీయే అభ్యర్థులైన నితీశ్ కుమార్, నితిన్ నబిన్, శివేశ్ కుమార్, రామ్‌నాథ్ ఠాకూర్, ఉపేంద్ర కుశ్వాహా ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో మహాయుతి ఆధిపత్యం
మహారాష్ట్రలో 7 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 288 సభ్యుల అసెంబ్లీలో 230కి పైగా ఎమ్మెల్యేలు ఉన్న మహాయుతి కూటమి 6 స్థానాలు గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి అభ్యర్థులుగా వినోద్ తావ్డే, రాందాస్ అథవాలే, పార్థ్ పవార్, జ్యోతి వాఘ్‌మారేలను బరిలో నిలిచారు. విపక్ష మహా వికాస్ అఘాడి మాత్రం తీవ్ర అంతర్గత చర్చల తర్వాత 85 ఏళ్ల ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్‌కు అవకాశం ఇచ్చింది.
ఒడిశాలో ఆసక్తికర పోటీ
ఒడిశాలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్‌కు మద్దతు ఇస్తోంది. ఆయనకు ప్రతిగా బీజేడీ డా. దత్తేశ్వర్ హోటాను బరిలోకి దించింది.
తమిళనాడులో కూటమి వ్యూహం
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే తన కూటమి సమీకరణాలను పటిష్టం చేసింది. డీఎంకే తరఫున తిరుచ్చి శివ, జే కాన్స్టాంటైన్ రవీంద్రన్లను అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే కాంగ్రెస్, డీఎండీకేలకు సీట్లు కేటాయించింది. అటు ఏఐఏడీఎంకే తరఫున ఎం. తంబిదురై, పీఎంకే నేత అన్బుమణి రామదాస్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి విజయం కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో
తృణమూల్ కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వారిలో మంత్రి బాబుల్ సుప్రియో, మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, రాజ్యాంగ నిపుణురాలు మేనక గురుస్వామి, సినీ నటి కోయెల్ మల్లిక్ ఉన్నారు.
బీజేపీ తరఫున రాహుల్ సిన్హా పోటీ చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో పరిణామాలు
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అనూహ్యంగా జిల్లా స్థాయి నేత అనురాగ్ శర్మకు అవకాశం ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నుంచి లక్ష్మీ వర్మ, కాంగ్రెస్ నుంచి ఫులో దేవి నేతామ్ పోటీలో ఉన్నారు. హర్యానాలో స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందాల్ బరిలోకి దిగడం ఆసక్తి రేపింది.అస్సాంలో బీజేపీ జోగెన్ మోహన్, తేరష్ గోవాలాలను అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలకు అవకాశం ఇచ్చింది.
