
అట్టహాసంగా మొదలైన ఉద్భవ్-2025 ఉత్సవాలు
గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ వెల్లడించారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని కేఎల్ యూనివర్శిటీ వేదికగా ఉద్భవ్-2025 వేడుకలను కేంద్రమంత్రి తొలిరోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాష కూడా ముఖ్యమే అన్నారు. గిరిజన వ్యవహారాల శాఖకు వాజ్ పేయి హయాంలో నామకరణం జరిగిందని ప్రస్తావించారు.ఐదేళ్ల క్రితం జరిగిన గిరిజన సంస్కృతి ఉత్సవాల సమయంలోనూ తానే కేంద్రమంత్రిగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జవహర్ లాల్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ల తరహాలోనే ఈఎంఆర్ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి ఓరమ్ స్పష్టం చేశారు.
ఉద్భవ్ అంటే హృదయాంతరాల నుంచి బయటకు తీయడం అనే అర్థం అన్నారు. అందుకే ఈ ఉత్సవాలకు ఆ పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంతో కష్టపడి ఉత్సవాలలో లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్ లను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ సంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవాన్ని జువల్ ఓరమ్ ఆవిష్కరించారు. అనంతరం కేంద్రమంత్రి జువల్ ఓరమ్ ని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సన్మానించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి ఓరమ్ ను ఈఎంఆర్ఎస్ విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆయన సభా ప్రాంగణం వద్ద గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. రు. అక్కడే ఏర్పాటైన గిరిజనుల ఉత్పత్తిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరకు కాఫీ స్టాల్ ను సందర్శించారు
ఉద్భవ్-2025 అంటే వేడుక కాదు..గొప్ప మార్పుకు వేదిక అని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. చిన్నారులలోని ప్రతిభ, సృజనాత్మకతను బయటకి తీసి విశ్వాసం నింపాలనేదే లక్ష్యమన్నారు. కొత్త పరిచయాలు, కొత్త సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఈ ఉత్సవం వల్ల సాధ్యపడుతుందన్నారు. 405 ఈఎంఆర్ఎస్ స్కూళ్ల నుంచి 1647 మంది తరలివచ్చారని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొనే వేదిక ఏపీ కావడం సంతోషకరమన్నారు. 110 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాలకు సీఎం నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. గిరిజన చిన్నారులు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్ల వంటి గొప్ప చదువు చదవడమే కాకుండా మంచి పౌరులుగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలోని గిరిజన బిడ్డల చదువు, పాఠశాల వసతులకు మరిన్ని నిధులివ్వాలని కేంద్రమంత్రి ఓరమ్ కు విన్నవించారు. గిరిజనులుండే రిమోట్ ఏరియాలో రోడ్డు నిర్మాణం, అనుసంధానానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
మరోవైపు 8 లక్షల మంది గిరిజనులున్న ఏపీలో ఉద్భవ్ -2025కు ఆతిథ్యమిస్తున్నందుకు గర్వపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్ పేర్కొన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల మనలోని వైవిధ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 740 ఈఎంఆర్ఎస్ లు ఉన్నాయన్నారు. 440 ఈఎంఆర్ఎస్ భవనాలను కేంద్రం నిర్మిస్తోందన్నారు. రాష్ట్రాలవారీగా గిరిజనుల జీవన వైవిధ్యం, సంస్కృతిని దేశవ్యాప్తంగా తెలిపే వేదికగా ఉద్భవ్-2025 మారుతుందన్నారు.
మూడు రోజుల పాటు జరిగే పోటీలకు తగ్గ భోజన, వసతి సదుపాయాలు సిద్ధంగా ఉందన్నారు. కేఎల్ యూనివర్శిటీలో 2 థియేటర్లు, 3 సెమినార్ హాల్స్, 10 తరగతి గదులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, పెద్ద సెమినార్ హాల్ లలో వివిధ కేటగిరీలకు పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్, పిల్లి మాణిక్యరావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ హసన్ బాషా,టీడీపీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ దారు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి M.మల్లికార్జున నాయక్, నెస్ట్స్ కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాత్సవ, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి, నెస్ట్స్ జాయింట్ కమీషనర్ బిపిన్ చంద్ర రటూరీ, కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ డీన్, ప్రొఫెసర్ జీపీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
