Let's talk: editor@tmv.in
అట్టహాసంగా ముగిసిన ‘అమరావతి ఆవకాయ్’ వేడుకలు

అట్టహాసంగా ముగిసిన ‘అమరావతి ఆవకాయ్’ వేడుకలు

Panthagani Anusha
12 జనవరి, 2026

తెలుగువారి సంస్కృతి, కళలు, ఆవకాయ రుచుల కలయికగా విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ద్వీపం వేదికలపై మూడు రోజుల పాటు సాగిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవాలకు ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనను చూసి అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను ఇకపై ఏటా ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మళ్ళి ఈ ఏడాది చివరన (2026) డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు.

త్వరలోనే ‘నంది’ పురస్కారాలు

గత ప్రభుత్వ హయాంలో కళలు, సంస్కృతి నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన మంత్రి కూటమి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి నిలిచిపోయిన నంది అవార్డులను ప్రతిభావంతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉగాది, కందుకూరి పురస్కారాలను అందజేశామని త్వరలో ఇతర పురస్కారాల ప్రదానం ఉంటుందని తెలిపారు.

అలరించిన కళా ప్రదర్శనలు

టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సినిమా, సాహిత్యం, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత ప్రస్థానంపై జరిగిన చర్చా కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్న 'సాహిత్యం-సినిమా' చర్చా వేదిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఆలపించిన కురుక్షేత్ర పద్యాలు, ఏకపాత్రాభినయం ఉత్సవాలకే హైలైట్‌గా నిలిచాయి. చిన్నారులు, యువతను వెంట్రిలాక్విజం ప్రదర్శనలు కట్టిపడేశాయి.

ఇక మూడు రోజుల పాటు సాగిన ఈ సంబరాలకు సందర్శకులు పోటెత్తారు. భవానీ ద్వీపాన్ని 15 వేల మంది పున్నమి ఘాట్‌ను 30 వేల మంది.. మొత్తంగా 45 వేల మందికి పైగా సందర్శించి ఆవకాయ రుచులను, కళా ప్రదర్శనలను ఆస్వాదించారు. "అమరావతిని ప్రజారాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల ప్రత్యేక ముద్రగా భావిస్తున్నాం. జీవితంలోని నవరసాల కలయికే ఈ ఫెస్టివల్" అని మంత్రి దుర్గేష్ కొనియాడారు.

ఈ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, షాజహాన్ బాషా, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్ వర్క్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.