
అట్టహాసంగా ప్రారంభమైన కొండవీడు ఫెస్ట్
చారిత్రక కొండవీడు కోట శనివారం జనసంద్రమైంది. రెడ్డి రాజుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ గిరిదుర్గంపై 'కొండవీడు బెస్ట్' వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కొండవీడు కోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "రెడ్డి రాజుల శౌర్యానికి సాక్ష్యమైన ఈ కోట ఖ్యాతి నలుదిశలా వ్యాప్తించాలి. పర్యాటకులకు అన్ని రకాల వసతులు కల్పించి, ఇక్కడి చరిత్రను భావితరాలకు అందిస్తాం" అని వారు పేర్కొన్నారు. ప్రముఖ చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి కొండవీడు ప్రాశస్త్యాన్ని రాజుల పరిపాలనా దక్షతను వివరించగా అతిథులు ఆసక్తిగా విన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు పెమ్మసాని, ఆనం, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా కలిసి కోట చెరువులో సరదాగా బోటింగ్ చేశారు. అనంతరం కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెలీ రైడ్‌లో పాల్గొని గగనతలం నుంచి కోట అందాలను వీక్షించడం విశేషం. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఇసుకతో తీర్చిదిద్దిన సైకత శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, పర్యాటకులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కోట పరిసరాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్ పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వర రావు, శిల్పారామం చైర్ పర్సన్ మంజుల రెడ్డి, మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
