
అట్టడుగు స్థాయిలో ‘పోష్’ చట్టం పటిష్టంగా అమలు చేయాలి: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్
ఉద్యోగ ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించే ‘లైంగిక వేధింపుల నివారణ, నిషేధం పరిష్కార చట్టం–2013’ను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని తిక్కన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టంపై మహిళలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు గ్రామీణ స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పది మంది కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయడం చట్టరీత్యా తప్పనిసరి అని శైలజ గుర్తుచేశారు. జిల్లాలో ఇప్పటికే 256 కమిటీలు ఏర్పాటు చేయడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అవి కేవలం రికార్డులకే పరిమితం కాకుండా చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. ఈ కమిటీ సభ్యులకు చట్టంపై సరైన అవగాహన లేకపోవడాన్ని తాము గమనించామని త్వరలోనే వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు కమిటీలు అత్యంత సున్నితంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
చట్టం అమల్లోకి వచ్చి 13 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఒత్తిళ్లు, అవమానాలకు భయపడి మౌనంగా ఉండవద్దని ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. బాధితులు నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘షీ-బాక్స్’ పోర్టల్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ సదస్సులో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అమానుషమని, అది నేరమని హెచ్చరించారు. ప్రతి కార్యాలయంలోనూ మహిళలకు తగిన గౌరవం, స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాల దేనని పేర్కొన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
