
అటవీ సంరక్షణలో యువ ఐఎఫ్‌ఎస్ అధికారుల పాత్ర కీలకం: మంత్రి కొండా సురేఖ
తెలంగాణ క్యాడర్‌లో ఇటీవల నియమితులైన యువ భారత అటవీ సేవ (ఐఎఫ్‌ఎస్) అధికారులు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి భవిష్యత్ సేవలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణ, అటవీ సంపద సంరక్షణ, వన్యప్రాణుల రక్షణలో అటవీ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు రాష్ట్రానికి పర్యావరణ పరంగా ఊపిరిలాంటివని, వాటిని కాపాడే బాధ్యత అటవీ శాఖపై ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువ ఐఎఫ్‌ఎస్ అధికారులు ఆధునిక ఆలోచనలతో, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అటవీ సంరక్షణకు మరింత బలం చేకూర్చగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అటవీ చట్టాలు, నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూనే అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు, స్థానిక ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. అటవీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని ఆమె పేర్కొన్నారు.
అలాగే, అక్రమ అటవీ నరుకు, వన్యప్రాణుల అక్రమ వేట వంటి కార్యకలాపాలను కట్టడి చేయడంలో అటవీ అధికారులు కీలకంగా వ్యవహరించాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడే దిశగా అంకితభావంతో పనిచేయాలని మంత్రి కొండా సురేఖ యువ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో వారు ముందుండాలని ఆమె ఆకాంక్షించారు.
