
అట్టుడికిన ఆంధ్రా యూనివర్సిటీ
ఆంధ్రా విశ్వవిద్యాలయం అట్టుడికిపోతోంది. విద్యార్థి మరణం విషయంలో చెలరేగిన ఆందోళన ఉధృతం అవుతోంది. ఇటు విశ్వవిద్యాలయం పాలకులు, అటు అధికార పార్టీ నేతలు సమస్యను అర్థం చేసుకోలేక, పరిష్కరించలేక చేతులెత్తేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు వీసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వర్సిటీలో వరుసలతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
కనీస వసతులు కరువు
వర్సిటీలో విద్యార్థులకు కనీస వసతులుండవు. పాచి పోయిన అన్నం.. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఉంటోంది. హాస్టళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విద్యార్థులకు జ్వరమొస్తే అక్కడున్న డిస్పెన్సరీలో మందులే కరువే. ఉన్న అతిథి అధ్యాపకుల్ని వదిలేసి, బయటివారిని తెచ్చుకుంటున్నారు. అన్నింట్లోనూ అవకతవకలే. అత్యంత ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్శిటీలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. తాజాగా మణికంఠ అనే విద్యార్థి మృతి చెందితే అధికారుల నుంచి కనీస స్పందన లేదు. దీంతో శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం అట్టుడికిపోయింది. మణికంఠ మృతికి నిరసనగా విద్యార్థులు రోడ్డెక్కారు. అరువుగా తెచ్చుకున్న వీసీ రాజశేఖర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏయూ పాలనను స్తంభింపజేశారు. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. పోలీసుల మోహరింపుతో బంద్ వాతావారణ తలపించింది.
మణికంఠ మరణానికి బాధ్యులెవరు?
ఏపీలోనే తొలిస్థానంలో ఉన్న ఏయూ ప్రపంచ దేశాల్లోనూ పేరొందింది. ఏయూలో బీఈడీ చదువుతున్న మణికంఠ అనే విద్యార్థి ఆ యూనివర్సిటీ డిస్పెన్సరీ అంబులెన్సులో ఆక్సీజన్ లేక మృతి చెందాడు. ఆయనకు అస్వస్థత చేకూరగా తొలుత ఏయూ డిస్పెన్సరీకి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఏయూకు చెందిన అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఏయూ అంబులెన్సులో ఆక్సీజన్ ఉండి ఉంటే మణికంఠ బతికే వాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మణికంఠ మృతికి బాధ్యులెవరంటూ విద్యార్థులు మూకుమ్మడిగా శుక్రవారం ఉదయం ఏయూను ముట్టడించారు. వీసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శించారు. కొన్నాళ్లుగా విశ్వవిద్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. వందేళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయాన్ని పరిపాలించడానికి పాలనా అనుభవం లేని వాళ్లకు పగ్గాలప్పగించారంటూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపించారు. మణికంఠ కుటుంబానికి విశ్వవిద్యాలయం, ప్రభుత్వం బాధ్యత వహించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మణికంఠ పరిస్థితి ఒక విదేశీ విద్యార్థికి వస్తే అది అంతర్జాతీయ విషయంగా మారి ఉండేదని, విశ్వవిద్యాలయం భవిష్యత్తు నాశనమైపోయేదని హెచ్చరించారు. డిస్పెన్సరీలో వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం, సక్రమమైన వసతి అందుబాటులో ఉండేలా చూడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాయుడు విజ్ఞప్తి చేశారు.
రోడ్డెక్కి ఆందోళన
విద్యా రంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే మణికంఠ మృతికి కారణమైందంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణికంఠ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, సమయానికి అత్యవసర వైద్యం అందకపోవడం వల్లే ఆయన మృతి చెందాడం టూ మండిపడ్డారు. 'విద్యను సరకుగా మార్చే యడంతో విద్యార్థులు ఒట్టి కొనుగోలుదారులుగానే మిగిలారంటూ' దిశ విద్యార్థి సంఘం కార్యకర్త అవినాష్ తెలిపారు.
వీసీ మొండి వైఖరి వీడాలి
కొన్నాళ్లగా ఏయూలోని హాస్టల్ పరిస్థితులు, అపరిశుభ్రతపై సమస్యలు, నాసిరక భోజనం, వైద్య సదుపాయాల లేమి వంటి విషయాలపై విద్యార్థులు పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. దీంతో అక్కడి పరిస్థితులు మరింత దిగజారాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాల్సిన వీసీ ఆచార్య రాజశేఖర్ బాబు ఏ మాత్రం స్పందించకపోవడంపై విద్యార్థుల్లో ఆవేదన తన్నుకొచ్చింది. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించకుండా, నిరసన చేస్తున్న విద్యార్థుల్ని అల్లరి మూకలుగా వర్ణించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
అసెంబ్లీలోనూ చర్చ
ఏయూ విద్యార్థి మణికంఠ మృతిపై శుక్రవారం అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. మణికంఠకు ఫిట్స్ రావడం వల్లే మృతి చెందాడని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అంబులెన్సులో ఆయనను వైద్యశాలకు తీసుకెళ్లినా కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని కొంతమంది రాజకీయం చేస్తున్నారని, విశ్వ విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని హితవు పలికారు. ఏయూను టాప్ -10లో ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని, వీసీలను ఇబ్బంది పెట్టి, ఆటంకాలు సృష్టించడం సరైన చర్య కాదని విద్యార్థుల్ని హెచ్చరించారు. రాజకీయాలు చేస్తే సహించబోమని, కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేస్తామని, వంద రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు.
నిరసన విరమించిన విద్యార్థులు
ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి విద్యార్థులు ఉద్యమాన్ని విరమించారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రతినిధి , వీసీ, విద్యార్థుల చర్చలు ఫలించాయి. ముగ్గురు సభ్యులతో టెక్నీకల్ కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది.
కేజీహెచ్ వైద్యులు, డీఎంహెచ్ఓ, డీన్ ఆఫ్ వెల్ఫేర్ తో జరిగిన ఘటనపై విచారణ జరుపనున్నారు. ఏయూ వీసీ రాజశేఖర్ టెక్నీకల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విద్యార్థుల డిమాండ్లు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉద్యమాన్ని విరమింపజేశారు.
