Let's talk: editor@tmv.in
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు: రోహిత్ పవార్

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు: రోహిత్ పవార్

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్‌పవార్‌‌ మరణించిన ఘటనపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్‌పవార్‌‌ మరోసారి ప్రశ్నలు లేవనెత్తారు. సామాజిక కార్యకర్త అంజలి దమానియా వెల్లడించిన సమాచారం ఆధారంగా స్వయం ప్రకటిత గాడ్‌మన్‌ అశోక్‌ ఖరాత్ ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దమానియా మాట్లాడుతూ, సమత క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఖరాత్ ఖాతాతో సంబంధం ఉన్న ఎస్ఎంఎస్ అలర్ట్‌లలో అసాధారణ మార్పులు కనిపించాయని చెప్పారు. జనవరి 27న 17 సందేశాలు వచ్చాయని, విమాన ప్రమాదం జరిగిన జనవరి 28న 19 సందేశాలు వచ్చాయని తెలిపారు. అనంతరం రోజుల్లో కూడా అనేక సందేశాలు వచ్చాయని, ఇది సాధారణంగా కనిపించే నమూనా కాదని ఆమె అన్నారు. ఈ సందేశాలు ఖరాత్ ఖాతాలో డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు సంబంధించినవని పేర్కొన్నారు.

ఖరాత్‌ వీఎస్‌ఆర్‌‌ విమానాల్లోనే ప్రయాణించాడు

ఈ విషయంపై ఎక్స్‌లో స్పందించిన రోహిత్ పవార్, ఖరాత్ అదే సమయంలో భారీ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు బయటపడటం తీవ్రమైన అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రమాదానికి ముందు అజిత్ పవార్ నివాసం బయట కాళి మంత్రాలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం కూడా గుర్తుచేశారు. ఖరాత్ తరచుగా వీఎస్ఆర్ కంపెనీకి చెందిన విమానాల్లో ప్రయాణించినట్లు సమాచారం ఉందని, అలాగే అతనికి పెద్ద అనుచర వర్గం ఉందని చెప్పారు. జనవరి 28న బారామతిలో కూలిన లియర్‌జెట్‌–45 విమానం వీఎస్ఆర్ కంపెనీదేనని తెలిపారు. ఈ సంఘటనలన్నింటికీ, విమాన ప్రమాదానికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఖరాత్‌తో పాటు అతనికి సంబంధం ఉన్న వ్యక్తులను కూడా విచారించాలని రోహిత్ పవార్ కోరారు.