
అజిత్ పవార్ మృతి ఘటనపై దర్యాప్తు చేయాలి: మమత
విమాన ప్రమాదంలో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రస్తుత దర్యాప్తు సంస్థలన్నీ పూర్తిగా రాజీ పడ్డాయని ఆమె ఆరోపించారు. ఆమె డిమాండ్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, శివసేన (యూబీటీ) నేతలు సహా పలువురు విపక్ష నాయకులు మద్దతు తెలిపారు.
కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ మాకు సుప్రీంకోర్టుపైనే నమ్మకం ఉంది. మిగతా అన్ని దర్యాప్తు సంస్థలు పూర్తిగా రాజీ పడ్డాయి. నిజం బయటకు రావాలంటే అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే విచారణ జరగాలని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ త్వరలోనే తన మేనమామ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్‌పీ) వర్గంలోకి తిరిగి చేరాలని భావిస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించాయని మమతా బెనర్జీ సూచించారు. ఈ ఉదయం ఆయన మరణ వార్త విని తీవ్రంగా షాక్‌కు గురయ్యాను. ఈ దేశంలో రాజకీయ నాయకులకు కూడా భద్రత లేదన్నది ఇది సూచిస్తోందని ఆమె అన్నారు.
ఖర్గే మద్దతు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలనే డిమాండ్‌కు మద్దతు తెలిపారు. ఇది ప్రమాదమే అయినా విచారణ జరగాలి. పెద్ద విమానాలు కూలిన ఘటనలు గతంలో చూశాం. ఇది చిన్న విమానం. మరి ప్రమాదం ఎందుకు జరిగింది? తప్పనిసరిగా దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. అజిత్ పవార్ అకాల మరణం దేశానికే తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి తెలిపారు.
ఇతర విపక్ష నేతల స్పందన
ఇలాంటి ఘటనల్లో గతంలోనూ పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలు బయటకు రావాలంటే నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. శివసేన (యూబీటీ) ఎంపీ అనిల్ దేశాయ్ కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చార్టెడ్ విమానాల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై స్పష్టత రావాలని పేర్కొన్నారు. బీజేడీ ఉపాధ్యక్షుడు దేబీ ప్రసాద్ మిశ్రా కూడా ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు.
కేంద్రం స్పందన
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ పవార్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
ప్రమాద వివరాలు
66 ఏళ్ల అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు, బుధవారం ఉదయం పుణె జిల్లా బారామతీ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఢిల్లీకి చెందిన వీఎస్‌ఆర్ వెంచర్స్ నిర్వహిస్తున్న లియర్‌జెట్–46 విమానం బారామతీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలో సిబ్బందితో సహా ఐదుగురు ఉన్నట్టు డీజీసీఏ తెలిపింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయంలో దృశ్యమానత తక్కువగా ఉండటం ప్రమాదానికి కారణమై ఉండొచ్చు. డీజీసీఏ, ఏఏఐబీ బృందాలు విచారణ ప్రారంభించాయి. పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
