
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు: సంజయ్ రౌత్
మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఏదో అనుమానాస్పద అంశం ఉందని పేర్కొంటూ, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. ఎన్‌సీపీ రెండు వర్గాల విలీనంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే అజిత్ పవార్ మృతి చెందడం పలు ప్రశ్నలకు దారితీస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ పవార్ ‘రెండు పార్టీలను విలీనం చేయాలని’ కోరుకున్న తర్వాత, ఆయనపై సించన (ఇరిగేషన్) స్కామ్ ఫైళ్లతో బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. ఆ పరిణామాల తరువాత కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత అజిత్ పవార్ ఇలా విమాన ప్రమాదంలో మరణించడం, ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు అన్నీ పరిశీలించాల్సినవే. ఇందులో ఏదో అనుమానాస్పదంగా ఉంది. తెర వెనుక ఏదో జరిగి ఉండవచ్చనే భావన కలుగుతోంది. ఇది జస్టిస్ లోయ ఘటనను గుర్తుకు తెస్తోందని వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఎన్‌సీపీ నేత అమోల్ మిట్కారి కూడా స్పందించారు. అజిత్ పవార్ చివరి ప్రయాణంలో మారిన మార్గం, అకస్మాత్తుగా పైలట్ మార్పు వంటి అంశాలు అనుమానాలను పెంచుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై సీబీఐ స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయమై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. అయితే, ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్ పవార్ మాత్రం ఈ ఘటనను రాజకీయంగా మలచవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ఒక ప్రమాదమేనని, అనవసర ఊహాగానాలు వద్దని ఆయన సూచించారు. జనవరి 28న పుణే జిల్లా బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక ఫ్లైట్ అటెండెంట్, ఇద్దరు పైలట్లు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారిక దర్యాప్తు ప్రారంభించింది.
జస్టిస్ లోయ ఘటన
సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.హెచ్. లోయ 2014 డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో అకస్మాత్తుగా మృతి చెందారు. అధికారికంగా ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణంగా ప్రకటించారు. అయితే, కేసు రాజకీయంగా సున్నితమైనది కావడంతో పాటు కీలక దశలో ఉండటంతో, జస్టిస్ లోయ మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు, వర్గాలు స్వతంత్ర విచారణ కోరాయి. ఈ నేపథ్యంలో 2018లో సుప్రీంకోర్టు జస్టిస్ లోయ మృతి సహజ కారణాల వల్లే జరిగిందని స్పష్టం చేస్తూ, కొత్త విచారణ అవసరం లేదని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, ఈ ఘటన న్యాయవ్యవస్థ స్వతంత్రతపై చర్చకు దారి తీసిన సంఘటనగా ఇప్పటికీ ప్రస్తావనకు వస్తోంది.
సునేత్రా పవార్ నియామకంపై ‘సామ్నా’ ఆందోళన
మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన కొద్ది రోజులకే ఆయన భార్య సునేత్రా పవార్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమించడంపై శివసేన (యూబీటీ) పత్రిక సామ్నా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నియామకాన్ని ‘తొందరపాటు నిర్ణయం’గా అభివర్ణించిన సామ్నా, దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ ఎత్తుగడగా ఆరోపించింది.
అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర ఇంకా కోలుకోకముందే, ఈ నిర్ణయం మరోసారి ప్రజలకు షాక్ ఇచ్చిందని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. రాష్ట్రానికి తొలి మహిళా ఉపముఖ్యమంత్రి దక్కడం సంతోషకరమే అయినా, అది వ్యక్తిగత పరిపాలనా ప్రతిభ ఆధారంగా కాకుండా, పైస్థాయి రాజకీయ నిర్ణయాల వల్లే జరిగిందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రజల్లో మిశ్రమ స్పందన ఉందని వివరించింది. అజిత్ పవార్ అంత్యక్రియల బూడిద ఇంకా చల్లారకముందే సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ మర్యాదలకు విరుద్ధమని సామ్నా విమర్శించింది. ఈ నిర్ణయంపై ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే తాము ఎలాంటి సమాచారం పొందలేదని చెప్పడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొంది. కుటుంబ సభ్యులకు తెలియజేయకుండానే ప్రమాణ స్వీకారానికి వెళ్లడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇందుకు బీజేపీ నాయకత్వమే కారణమని ఆరోపించింది.
అజిత్ పవార్ మరణానంతరం పార్టీలో నాయకత్వ పోరు మొదలైందని సామ్నా పేర్కొంది. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే మధ్య పోటీ పెరగడంతో, ‘పవార్–పాటిల్’ పార్టీ ‘పటేల్’ పార్టీగా మారకుండా ఉండేందుకే సునేత్రా పవార్‌ను ముందుకు తెచ్చారని వ్యాఖ్యానించింది. ఈ పరిణామాలను ఒక పడవకు ఉపమానిస్తూ, ఆ పడవ ఇంజిన్ ఫడ్నవీస్ చేతుల్లో ఉందని, దాని నియంత్రణ కూడా ఆయనే చేస్తున్నారని విమర్శించింది. అజిత్ పవార్ పార్టీ భవిష్యత్తు అనిశ్చితిలో ఉందని పేర్కొంది.
