
అజిత్ దాదా ఇక సెలవ్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో నిర్వహించారు. ఆయన కుమారులు జయ్, పార్థ్ పవార్ చితికి నిప్పంటించి తుది కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్, సినీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ సహా అనేక మంది ప్రముఖులు హాజరై అజిత్ పవార్‌కు చివరి నివాళులు అర్పించారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
అజిత్ పవార్ మృతిపై ప్రజల్లో ఉన్న అపారమైన ఆదరణకు నిదర్శనంగా, పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యా ప్రతిష్ఠాన్ మైదానానికి చేరుకుని తమ ప్రియ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. మృతదేహాన్ని మైదానానికి తీసుకొస్తున్న సమయంలో మద్దతుదారులు ‘అజిత్ దాదా అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య సునేత్రా పవార్, కుమారులు, మేనల్లుడు రోహిత్ పవార్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే, ఆయన కుమార్తె ప్రణీతీ షిండే కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.
విమాన ప్రమాదంపై దర్యాప్తు
ఇదే సమయంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. బారామతిలోని ప్రమాద స్థలానికి డీజీసీఏ అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు చేరుకుని పరిశీలనలు చేపట్టాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, మహారాష్ట్ర డీజీపీ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనపై పుణె గ్రామీణ పోలీసులు బారామతి తాలూకా పోలీస్ స్టేషన్‌లో అకస్మాత్తు మరణంగా (ఏడీఆర్) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
‘మహారాష్ట్రకు మరో అజిత్ దాదా దొరకరు’
కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే ఈ ఘటనను హృదయవిదారకమైనదిగా అభివర్ణిస్తూ, మహారాష్ట్రకు మరో అజిత్ దాదా లాంటి నాయకుడు దొరకరు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు.
రాజకీయ ప్రయాణం
జూలై 22, 1959న అహ్మద్‌నగర్ జిల్లా రాహురి తాలూకాలోని దేవళాలి ప్రవారాలో జన్మించిన అజిత్ పవార్, ప్రజల్లో ‘అజిత్ దాదా’గా ప్రసిద్ధి చెందారు. పాల సహకార సంఘాలు, షుగర్ ఫ్యాక్టరీలు, బ్యాంకులు వంటి సహకార రంగ సంస్థల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, 1991లో లోక్‌సభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత బారామతి సీటును తన మామ శరద్ పవార్ కోసం ఖాళీ చేశారు. తదుపరి కాలంలో ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో అత్యధిక కాలం (నాన్-కంటిన్యూయస్‌గా) ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. ప్రతిభా చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాక్రే, ఏకనాథ్ షిండే ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజకీయ మలుపులు
నవంబర్ 2019లో ఎన్సీపీలో విభజనకు కారణమై, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 2024లో ఎన్నికల సంఘం ఎన్సీపీ పేరు, చిహ్నాన్ని అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది.అయినప్పటికీ రాజకీయ భేదాభిప్రాయాల మధ్య కూడా తన మామ శరద్ పవార్‌తో సన్నిహిత సంబంధం కొనసాగించారు. ఇటీవల జరిగిన పుణె, పింప్రి–చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో రెండు ఎన్సీపీ వర్గాలు కలిసి పోటీ చేయడం దీనికి ఉదాహరణగా నిలిచింది. సూటిగా మాట్లాడే స్వభావం, ప్రజలతో మమేకమయ్యే నాయకత్వం అజిత్ పవార్‌కు ప్రత్యేక గుర్తింపు.
పీఎస్‌వోకు కూడా అంత్యక్రియలు
ఇదే ప్రమాదంలో మృతి చెందిన అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో) విదిప్ దిలీప్ జాధవ్ అంత్యక్రియలు బుధవారం రాత్రి సతారా జిల్లాలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. ఆయన చిన్న కుమారుడు తండ్రికి తుది కర్మలు నిర్వహించడం అందరినీ కలచివేసింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
దర్యాప్తు కోరిన సంజయ్ రౌత్
ఈ ఘటనపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, విమాన ప్రమాదంపై సమగ్ర, పారదర్శక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చార్టెడ్ విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక లోపమా? రాడార్ వైఫల్యమా? విమానాశ్రయ లోపాలా?
అజిత్ పవార్ లాంటి మహానేత మృతి చెందిన ఘటనపై నిజాలు ప్రజలకు తెలియాలని ఆయన మీడియాతో అన్నారు. కేవలం సానుభూతి సందేశాలతో సరిపోదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అసలు కారణాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని రౌత్ స్పష్టం చేశారు.
ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కి చివరి వీడ్కోలు
ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి అంత్యక్రియలు గురువారం ముంబై శివాజీ పార్క్ సిమెటరీలో నిర్వహించారు. పింకీ మాలి కుటుంబసభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
