Let's talk: editor@tmv.in
అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం: మంత్రి పొన్నం ప్రభాకర్
అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం: మంత్రి పొన్నం ప్రభాకర్

అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా, ప్రమాదాల నివారణ, అగ్నిమాపక భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీస్థాయిలో కార్యక్రమాలను చేపట్టింది. 'ప్రజా పాలన ప్రగతి' 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ భవన్‌లో 'అగ్నిమాపక భద్రత అవగాహన సదస్సు' ఘనంగా నిర్వహించబడింది.

ఈ సదస్సుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు రూ.800 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. అయితే సమయానికి స్పందించిన కారణంగా సుమారు 2,000 మంది ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు. అధిక శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం, భద్రతా నిబంధనల ఉల్లంఘన, అనుమతులు పొందిన తర్వాత అనధికార మార్పుల కారణంగానే జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు నివారణే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే ఫైర్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ 101 లేదా ఎమర్జెన్సీ నంబర్ 112 కు కాల్ చేయాలని సూచించారు.

ప్రభుత్వం ఫైర్ డిపార్ట్‌మెంట్, జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్ శాఖల సమన్వయంతో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ట్విన్ సిటీస్‌లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ కేబ్లింగ్ పనులు చేపట్టి విద్యుత్ సంబంధిత ప్రమాదాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రమాదకరమైన వైరింగ్ ఉన్నచో ప్రజలు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల సహకారం అవసరమని మంత్రి పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్లు, గ్యాస్ లీకేజీలు, పరిశ్రమల భద్రత లోపాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి విభాగాల మధ్య సమన్వయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అగ్ని భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని సీపీ హైదరాబాద్ ఇతర ఉన్నతాధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ, నివారణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి చోట్ల ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, మాల్స్, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, నివాస సముదాయాల వరకు ఈ కార్యక్రమాలను విస్తరించనున్నామని చెప్పారు.

విద్యుత్ శాఖ సీఎండీ జితేందర్ జితీష్ పటేల్ మాట్లాడుతూ, తగిన భద్రతా పరికరాలు లేకపోవడం, తప్పుడు వైరింగ్, ఎంసీబీలను బైపాస్ చేయడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా స్వీయ తనిఖీలు చేయడం, సరైన అర్తింగ్ ఏర్పాటు చేయడం, ప్రమాణిత పరికరాలు ఉపయోగించడం అవసరమని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ మాట్లాడుతూ, 15 మీటర్లలోపు ఎత్తున్న భవనాల్లో అనధికార సెల్లార్లు, సెట్బ్యాక్స్ వినియోగం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఫైర్ అనుమతులు పాటించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ దాసరి హరచందన మాట్లాడుతూ, చిన్నచిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెంకన్న అగ్ని ప్రమాదాల కారణాలు, రకాలు, నియంత్రణ పద్ధతులు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, ఖాళీ చేయించే ప్రణాళికపై సమగ్ర ప్రదర్శన ఇచ్చారు. హైడ్రా ఫైర్ అధికారి శ్రీధర్ ప్రమాద సమయంలో సమన్వయం, రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి వివరించారు. వైద్య శాఖ ప్రతినిధులు కాలిన గాయాల నిర్వహణపై అవగాహన కల్పించగా, కిమ్స్ ఆసుపత్రి ప్రతినిధులు సీపీఆర్ విధానాన్ని ప్రదర్శించారు.

సదస్సు అనంతరం ఆధునిక అగ్నిమాపక పరికరాలు, ఫైర్ ఫైటింగ్ రోబోట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ప్రత్యక్ష ప్రదర్శనను మంత్రి, అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్, రెవెన్యూ శాఖలతో పాటు వివిధ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, వ్యాపార సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.