
అగ్నివీర్ ఉద్యోగాలకు యువత దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ ద్వారా లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల కోసం ఈ నెల 9వ తేదీన గుంటూరులో అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ-2026 నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అవసరమైన పత్రాలు తీసుకువెళ్లి నేరుగా ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే అగ్నివీర్ వాయు 2027 రిక్రూట్మెంట్‌కు సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం అవివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, వయస్సు 22 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 10 లోపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ రెండు నోటిఫికేషన్లకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
అభ్యర్థులు https://iafrecruitment.edcil.co.in లేదా https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్లను సందర్శించి, అందుబాటులో ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
