Let's talk: editor@tmv.in
అగ్నికీలల్లో మధ్యభారతం..17 మంది మృతి

అగ్నికీలల్లో మధ్యభారతం..17 మంది మృతి

Pinjari Chand
19 మార్చి, 2026

దేశవ్యాప్తంగా బుధవారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఢిల్లీ, ఇండోర్ నగరాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదాల్లో మొత్తం 17 మంది మృతి చెందగా, అహ్మదాబాద్, చండీగఢ్ నగరాల్లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు సంభవించి ఆస్తినష్టం వాటిల్లింది. చిన్నారులు కూడా మృతుల్లో ఉండటం కలచివేసింది.

ఢిల్లీలో విషాదం.. 9 మంది సజీవదహనం

దక్షిణ పశ్చిమ ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 70 ఏళ్ల మహిళ ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్ చౌక్ మార్కెట్ సమీపంలోని భవనంలో ఈ ఘటన జరిగింది. భవనం దిగువ అంతస్తుల్లో దుస్తులు, కాస్మెటిక్స్ షోరూమ్ ఉండగా, పై అంతస్తుల్లో కుటుంబం నివసిస్తోంది. సువాసన ద్రవ్యాలు, ఇతర రసాయన పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం నుంచి దూకగా గాయపడ్డారు. సుమారు 30 ఫైర్ ఇంజిన్లు, 11 అంబులెన్సులు, పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇండోర్‌లో ఈవీ చార్జింగ్ పేలుడు.. 8 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇంటి బయట ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ సమయంలో జరిగిన పేలుడు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. మూడంతస్తుల ఇంటిలో మంటలు వ్యాపించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు.బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలో తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ఇంటి బయట కారును చార్జింగ్‌కు పెట్టగా చార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మంటలు కారును కప్పేసి, అక్కడి నుంచి ఇంటికి వ్యాపించాయని పేర్కొన్నారు. ఇంటి తలుపులు ఎలక్ట్రానిక్ లాక్‌లతో ఉండటంతో లోపలికి చొరబడడం కష్టమైందని పోలీసు కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు మరింత విస్తరించాయి.

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించగా, ఎనిమిది మందిని మృతదేహాలుగా వెలికితీశారు. మృతులను తన్మయ్ (6), రాశి సెథియా (12), సిమ్రన్ (30), టిను (35), సుమన్ సెథియా (60), విజయ్ సెథియా (65), చోటు సెథియా (22), మనోజ్ (65)గా గుర్తించారు.

ప్రధాని సంతాపం.. ఆర్థిక సాయం ప్రకటన

ఈ రెండు ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ ఉపశమన నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ తరంజీత్ సింగ్ సాంధూ నగరవ్యాప్తంగా ఫైర్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు (పెద్దలు), చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేసి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈవీ చార్జింగ్‌పై ప్రామాణిక మార్గదర్శకాలు (ఎస్‌వోపీ) రూపొందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేసి, బాధితులకు సహాయం చేయాలని పార్టీ నేతలను కోరారు.

అహ్మదాబాద్‌లో మార్కెట్ దగ్ధం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కలుపూర్ ప్రాంతంలోని రెవ్డీ బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించి 25కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు 36 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. భారీగా దుస్తుల నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చండీగఢ్‌లో షాపుల్లో మంటలు

చండీగఢ్ సెక్టార్-22లోని రద్దీ వాణిజ్య ప్రాంతంలో ఒక షాప్‌లో అగ్ని ప్రమాదం సంభవించి పక్క షాపులకు వ్యాపించింది. 15కిపైగా ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు వినియోగించారు. రసాయన పదార్థాల కారణంగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి.ఈ వరుస అగ్నిప్రమాదాలతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. భవన భద్రత, అగ్నిమాపక చర్యలపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

అగ్నికీలల్లో మధ్యభారతం..17 మంది మృతి - Tholi Paluku