Let's talk: editor@tmv.in
అంగన్వాడీల అభివృద్ధే ధ్యేయం

అంగన్వాడీల అభివృద్ధే ధ్యేయం

FL - SUNL
19 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీలపై చర్చ జరిగింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 55,746 అంగన్వాడీ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటిలో 48,268 అంగన్వాడీ కార్యకర్తలు, 6,732 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 47,569 అంగన్వాడీ సహాయకులు సేవలందిస్తున్నారని వివరించారు.

సిబ్బందికి గౌరవ వేతనాలు

రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500 గౌరవ వేతనంగా అందిస్తున్నారు. అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 7,000, అంగన్వాడీ సహాయకులకు రూ. 7,000 ఇస్తున్నారు. “2004లో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు జీతం కేవలం రూ. 2,700 మాత్రమే ఉండగా, నారా చంద్రబాబునాయుడు దాన్ని రూ. 4,200కి పెంచారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు జీతం 4,200 నుంచి 10,500కి పెంచారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.1,000 మాత్రమే పెరిగింది. కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని మంత్రి స్పష్టం చేశారు.

రూ.2 లక్షల ఆరోగ్య బీమా

అంగన్వాడీ వర్కర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 20 రోజుల వార్షిక సెలవులు, అలాగే మే నెలలో 15 రోజుల సెలవులు మంజూరు అవుతున్నాయి. వారి సేవలను గుర్తిస్తూ ప్రత్యేక పురస్కారాలు అందజేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లకు రూ.50,000 అవార్డు, అంగన్వాడీ సహాయకులకు రూ.40,000 అవార్డుతోపాటు ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రతి సంవత్సరం రెండు యూనిఫామ్ సెట్లు అందజేస్తున్నామన్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్లకు రూ.1,00,000, అంగన్వాడీ సహాయకులకు రూ.40,000 గ్రాట్యుటీ చెల్లింపులు చేస్తున్నామన్నారు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద విధి నిర్వహణలో మరణించిన పక్షంలో రూ. 2 లక్షల బీమా రక్షణ అందించబడుతుందని మంత్రి తెలిపారు.

కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6,732 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 5,000 మినీ అంగన్వాడీలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసినట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కేవలం భోజనం మాత్రమే అందించడం కాకుండా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్లే కిట్స్ కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్లే కిట్స్లోని బొమ్మల ద్వారా పిల్లలకు ఆటల రూపంలో చదువు నేర్పించడం, జ్ఞానం పెంపొందించడం, మరియు గుడ్ టచ్ బాడ్ టచ్ అవగాహన కల్పించడం జరుగుతోందని మంత్రి వెల్లడించారు. 11,400 అంగన్వాడీ కేంద్రాలకు మంచినీటి సదుపాయం, 10,000 అంగన్వాడీలకు మరుగుదొడ్లు, 8,000 అంగన్వాడీలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రివర్యులు తెలిపారు. త్వరలో అంగన్వాడీలను శాశ్వత భవనాలుగా మారుస్తున్నాం అని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లపై మరియు కార్మికులపై ఉన్న కేసులను ప్రభుత్వం తొలగించే ప్రక్రియలో ఉందని తెలిపారు. సొంత భవనం కలిగిన ప్రతి అంగన్వాడీకి రూ. 1,00,000 చొప్పున నిధులు కేటాయించబడతాయి. ఇందులో ప్రత్యేకంగా రూ. 10,000 పెరటి తోటల కోసం వినియోగించాలని సూచించారు.

అంగన్వాడీల అభివృద్ధే ధ్యేయం - Tholi Paluku